Sep 23,2023 12:28

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : కేంద్ర ప్రభుత్వంలో మోడీ-బిజెపి విధానాలతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని దళితులంతా ఈ కుట్రను తిప్పి కొట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి  సత్యనారాయణ అన్నారు. కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన దళిత రక్షణ యాత్ర  పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటకు శుక్రవారం రాత్రి చేరుకుంది. అనంతరం తిరిగి శనివారం ఉదయం ఆచంట నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం, పెనుగొండ, ఇరగవరం, వేల్పూరు, తాడేపల్లిగూడెం, కృష్ణయపాలెం, మీదుగా పెంటపాడులో రాత్రి బస చేస్తారు. ఈ సందర్భంగా ఆచంట కచేరి సెంటర్లో జరిగిన బహిరంగ సభలో సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం వల్ల దళితులకు హక్కులు స్వేచ్ఛ ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఇటువంటి రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి కుట్రను యావత్ ప్రజానీకానికి  తెలియజేయాలని సంకల్పంతో దళిత రక్షణ యాత్రను కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని వాపోయారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని దళితులకు ఇవ్వకుండా  ప్రభుత్వ పథకాలు పేరుతో అందరికీ పంచే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ హక్కులు హరిస్తున్నారని, రాజ్యాంగ పరిరక్షణకు ఇక పొరపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల విజయ్ కుమార్, కే కాంతి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జి,  చైతన్య ప్రసాద్, షేక్ వల్లి, స్థానిక నాయకులు వద్దిపర్తి అంజిబాబు, ఎస్ వి ఎన్ శర్మ,  కుసుమే జయరాజు, తలుపూరి బుల్లబ్బాయి, సిర్రా విగ్నేశ్వరుడు, కొండేటి రాఘవులు, మానుకొండ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.