Sep 24,2023 16:09
  • కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు డిమాండ్
  •   4వ రోజు కొనసాగిన దళిత రక్షణ యాత్ర

ప్రజాశక్తి - పెనుమంట్ర : ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు డిమాండ్ చేశారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన దళిత రక్షణ యాత్ర ఆదివారం గణపవరం, అత్తిలి మండలాలు మీదుగా పెనుమంట్ర మండలంలోకి ప్రవేశించింది. తొలుత నత్తారామేశ్వరం ప్రారంభంలో కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. పొలమూరులో ఐద్వా, డివైఎఫ్ఐ అధ్వర్యంలో పూల దండలతో ఘనస్వాగతం పలికారు.అనంతరం డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జరిగిన సభలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతి బాబు మాట్లాడుతూ దేశంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి దేశ సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. దళితుల అంటరానితనాన్ని రూపుమాపడానికి దళితుల అభివృద్ధి కోసం రాజ్యాంగ బద్దంగా ఇచ్చిన రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలని బిజెపి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి రిజర్వేషన్లను లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పరం చేసే అన్ని సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఒకవైపు దళితులకు రక్షణగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మార్పులు చేస్తూ తమ ఆర్.ఎస్.ఎస్.సిద్ధాంతాన్ని శరవేగంగా అమలు చేస్తుందని చెప్పారు. మరోవైపు దళితపేట అభివృద్ధికి పోరాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని నీరుగారుస్తున్నారన్నారు.అనంతరం యాత్రకు సంఘీభావంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కూసం పూడి సుబ్బరాజు, ఉపాధ్యక్షులు కేతగోపాలన్, ఐద్వా జిల్లా అధ్యక్షులు కేతా పద్మ పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కం శెట్టి సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి పల్లా చిన్న వీరభద్రం, మహిళా కన్వీనర్ జక్కం శెట్టి వెంకటలక్ష్మి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి చిన్నం చిన్న నాగేశ్వరరావు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.చైతన్య ప్రసాద్, షేక్ వలీ, కళాకారులు రాఘవులు, శ్రీనివాస్, యువజన నాయకులు కేతా ప్రమోద్ , తదితరులు పాల్గొన్నారు