Jun 12,2023 16:00
  • ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

ప్రజాశక్తి-మంగళగిరి : కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం చేసిన కౌలు రైతు చట్టాన్ని సవరించాలని, భూ యజమాని సంతకం తొలగించాలని, కౌలు రైతు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7వ తేదీ నెల్లూరు నుండి బయలుదేరిన జాత, ఐదో తేదీన అనకాపల్లి నుండి బయలుదేరిన జాతలు కృష్ణాజిల్లా తోట్ల వల్లూరు చేరుకున్నాయి. అక్కడనుండి 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరిన పాదయాత్ర సోమవారం మధ్యాహ్నానికి మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. సీసీఎల్ ఏను కలవడానికి కౌలు రైతులు రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అర్థగంట పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సి సి ఎల్ ఏ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చి వినతిపత్రం తీసుకోవడం జరిగింది. అనంతరం వి శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయాన్ని 70 శాతం కౌలు రైతులే చేస్తున్నారని వారి సమస్యల పరిష్కారానికి మాత్రం ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని అన్నారు. 2011 సంవత్సరంలో చేసిన కౌర రైతు చట్టం వలన కౌలు రైతులకు కొంతవరకు ఉపయోగపడటం జరిగిందని వివరించారు. 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి కౌలు రైతులను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలంటే నిబంధన పెట్టడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పకృతి వైపరీత్యాల వలన పంటలు నష్టపోయినప్పటికీ నష్టపరిహారం భూ యజమానుల ఖాతాలో వేస్తున్నారని, దాన్ని తీసుకోవడానికి కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందువల్ల ఈ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అసలు కౌలు రైతులని గుర్తించటానికి కూడా ఇష్టపడడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో సంవత్సరానికి 400 నుండి 600 వరకు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. అందువల్ల సమగ్ర చట్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని ఒక్కొక్క కౌలు రైతుకు మూడు ఎకరాలు చొప్పున భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కౌలు రైతు ముందు కౌలు రైతుల సమస్యలు పరిష్కరిస్తారా లేదా అని బోర్డులు పెట్టాలని కోరారు. స్థానికంగా సచివాలయాల వద్ద పోరాటాలను ఉదృతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ కౌలు రైతుల పేరుతోనే ఈ క్రాపింగ్ చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయ భూముల సాగు చేస్తున్న వారందరికీ సిసిఆర్ కార్డులు, బ్యాంకు రుణాలు, రైతు భరోసా, పంట నష్టపరిహారం, బీమా ఇవ్వాలని కోరారు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఈ సీజన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ముందు అధికారులు దరఖాస్తు స్వీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యజమాని సంతకం తొలగించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు తమ సమస్యల గోడును విన్నవించుకోవడానికి సిసిఎల్ కార్యాలయానికి వచ్చిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని రానివ్వకుండా చూడడానికి చూస్తున్నారని అన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే కౌలు రైతుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆహార పంటలు ఎంతో కష్టపడి పండిస్తున్న కౌలు రైతుల కష్టాలు తీర్చకపోతే ప్రజలు నానా ఇబ్బందులు పడతారని, ఆహార ఉత్పత్తులు తగ్గిపోతాయని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి సుబ్బారావు మాట్లాడుతూ సిసిఆర్ కార్డు పొందలేని కౌలు రైతులకు సాగు ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధంగా చట్టంలో మార్పు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి రంగారావు, ఉపాధ్యక్షులు ఏ బాలకృష్ణ, బి శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏమని అప్పారావు, జిల్లా నాయకురాలు బి కోటేశ్వరి, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, గుంటూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు జొన్న శివ శంకర్రావు, సిఐటియు నాయకులు ఎస్ఎస్ చేంగయ్య, జె.వి. రాఘవులు, డి వెంకట్ రెడ్డి, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.