May 19,2023 08:04

న్యూఢిల్లీ   :   కేంద్ర కేబినెట్‌లో గురువారం అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మోడీ కేబినెట్‌లో అత్యంత ఉన్నత స్థాయి మంత్రులలో ఒకరు, వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్న కిరణ్‌ రిజిజును న్యాయ శాఖ మంత్రి పదవి నుండి తొలగించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఆయన స్థానంలో కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. కేబినెట్‌ హోదాతో న్యాయ మంత్రిత్వ శాఖకు పదోన్నతి పొందిన ఏడాది లోపే ఆయనను ఆ పదవి నుండి తొలగిస్తూ ఆదేశాలు వెలువడటం గమనార్హం. రిజిజుకి  తక్కువ స్థాయి కలిగిన భూ విజ్ఞానశాస్త్ర శాఖ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం అర్జున్‌ మేఘ్వాల్‌ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. వీటితో పాటు న్యాయశాఖకు స్వతంత్ర మంత్రిగా వ్యవహరించనున్నారు. అయితే కేబినెట్‌ హోదా లేకుండా న్యాయశాఖను స్వతంత్ర మంత్రికి అప్పగించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌.. రాజస్థాన్‌ నుంచి ఎంపిగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం భూవిజ్ఞానశాస్త్ర శాఖతో పాటు శాస్త్ర సాంకేతికాభివృద్ధితో పాటు పలు శాఖల బాధ్యతలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ చూస్తున్నారు. ఇప్పుడు భూ విజ్ఞాన శాస్త్ర శాఖను కిరణ్‌ రిజిజుకు అప్పగించింది.

జడ్జీల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై కిరణ్‌ రిజిజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని ఆయన పేర్కొన్నారు.