'సొంతానికి తినేందుకు కూరగాయల్ని పండించుకుంటే డబ్బులను ముద్రించుకున్నట్లే' అంటున్నారు లాస్ ఏంజిల్స్‌కు చెందిన గెరిల్లా గార్డెనర్ రాన్ ఫిన్‌లే. ఆయన అథ్లెట్లకు ఫ్యాషన్ డిజైనర్. అక్కడి ప్రజలకు 'గ్యాంగ్‌స్టా గార్డెనర్'గా పిలువబడుతున్నారు. ఖాళీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో సామూహిక తోటల్ని నిర్వహిస్తున్నాడు. అది రోడ్డు పక్క కాస్త స్థలం కావొచ్చు, వంతెన కింది స్థలం కావొచ్చు, ఫుట్ పాత్‌పై మిగిలే చోటు కావొచ్చు... ఇలా ఎక్కడ కాస్త ఖాళీ స్థలం కనబడినా బంగాళా దుంప తదితర కూయగాయల్ని, పండ్ల మొక్కలను వేయడం మొదలుపెట్టాడు. పైగా అందులో అందర్నీ భాగస్వాముల్ని చేస్తున్నాడు. ఎవరైనా మొక్కల్ని పెంచొచ్చు. సంరక్షించొచ్చు. మరెవరైనా వాటిని కోసుకుని తినొచ్చు. కాయలుంటే ఫ్రీగా వస్తే తెంపుకుపోతాం.. కానీ, ఉచితంగా తోటపని ఎవరు చేస్తారనుకోవద్దు. ఈ 'గ్యాంగ్‌స్టా గార్డెనర్' అందర్నీ చైతన్యపరిచాడు. నేను సైతం అంటూ ఎందరో గార్డెనింగ్ చేస్తూ సేద తీరుతున్నారు. సాగులోని మజాను ఆస్వాదిస్తూ.. పర్యావరణాన్ని రక్షిస్తున్నారు.
ఇటువంటి యాక్టివిటీకి ఇన్నాళ్లూ దూరమైన స్కూలు పిల్లలు, యువతీ యువకులు కేరింతలు కొడుతూ పనిచేస్తున్నారు. అన్నట్టు .. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఓ కారణం లేకపోలేదు. ఊబకాయ సమస్య రోజురోజూకు పెరిపోవడాన్ని గమనించి, తానీ ఈ ఆలోచన చేశానంటున్నాడు రాన్. ఈ ఆలోచన అందరికీ నచ్చడంతో... ఆ ప్రాంతంలో ఎక్కడ కాస్త చోటు కనపడినా.. వెంటనే పలుగూ పారా తీసుకుని బయల్దేరుతున్నారు. ఉమ్మడిగా పండించుకున్న కూరగాయలపై, ఆకుకూరలపై మమకారాన్ని పెంచుకుంటున్నారు. ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటున్నారు అక్కడివారంతా. ఈ పని లాక్‌డౌన్ సమయంలో మరింతగా చేయగలిగామని వారంటున్నారు.