Jan 15,2023 12:19

ప్రకృతి గొప్ప కళాత్మక సాదృశ్యం. పరిశీలనగా చూడగలిగితే ప్రతిదీ కళాత్మకమే. ఒకప్పుడు పిచ్చి మొక్కలు, పనికిరాని మొక్కలుగా భావించే గడ్డి మొక్కలకు ఇప్పుడు మంచి గుర్తింపు ఏర్పడుతోంది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే గడ్డిని సేకరించి, వాటిని ప్రత్యేక తరహాలో పెంచి అమ్మకాలు జరుపుతున్నారు. కొన్ని పువ్వులు పూస్తూ, మరికొన్ని సుడులు తిరుగుతూ, ఇంకొన్ని రంగులు విరజిమ్ముతూ అలరిస్తున్నాయి. వాటిలో కొన్ని ఔషధ విలువలను కూడా అందిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వనప్రియ దృష్టి ఈ గ్రాస్‌ ప్లాంట్స్‌ మీద పడడంతో వీటి ప్రాధాన్యత పెరుగుతోంది. వయ్యారంగా హొయలు వలకబోస్తున్న రకరకాల గడ్డి మొక్కల గురించి తెలుసుకుందాం!
నిమ్మగడ్డి..
గుబురుగా, అందంగా, చుట్టూ విచ్చుకుంటూ పెరిగేది నిమ్మగడ్డి. కాస్తంత లేత ఆకుపచ్చగా నవనవలాడుతూ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీన్ని ఎప్పటికప్పుడు కావలసినంత సైజులో కత్తిరించుకోవచ్చు కూడా. సింబోపోగాన్‌ దీని శాస్త్రీయ నామం. ఎక్కువగా నిమ్మ నూనె తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీనిలో సిట్రాల్‌ అనే రసాయనం ఉండడం వల్ల నూనె మంచి సువాసన వస్తుంది.
'ఏ' విటమిన్‌ తయారుచేయడానికి నిమ్మగడ్డని ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి ఉన్న చోటకి దోమలు రావు. ఇది కుండీల్లోనూ నేల మీద పెరుగుతుంది. ఇంటి ముంగిట, పెరట్లోని, ప్రహరీగోడల మీద, ల్యాండ్‌ స్కేటింగ్‌ మధ్యభాగాల్లోనూ అలంకరణకు నిమ్మగడ్డిని ఎక్కువగా పెంచుతుంటారు. సౌందర్య రసాయనాలు, క్రీములు, జెల్‌లు, ఫేస్‌వాష్‌లు, సబ్బులు, టానిక్కుల తయారీలో నిమ్మగడ్డిని వినియోగిస్తున్నారు.


వయ్యారిభామ గడ్డి..

1

ప్రపంచంలో అతి సుందరమైన, విలువైన గడ్డి జాతుల్లో ఒకటి వయ్యారిభామ గడ్డి. ఇది సన్నగా, నాజుగ్గా, తల వెంట్రుకల మాదిరిగా ఒంగే దక్షతతో, కాస్త మెరుస్తూ ఉంటుంది. దాని చివరల నిత్యం తెల్లటి చిన్న చిన్న పువ్వులు పూస్తూ ఎంతో శోభాయమానంగా ఉంటుంది. కురులు విరబోసినట్టుగా ఈ గడ్డి కుండీ చుట్టూ విస్తరించి, గాలికి స్వైరవిహారం చేస్తూ కనువిందుగా అలరిస్తుంది. ఐసో లేపేస్‌ సెన్నోవా అనేది దీని శాస్త్రీయ నామం. ప్రపంచమంతటా 'ఫైబర్‌ ఆప్టిక్‌ గ్రాస్‌' అని దీన్ని ముద్దుగా పిలుచుకుంటారు. కాలిఫోర్నియా ప్రాంతం నుంచి ప్రపంచమంతటా ఈ గడ్డి విస్తరించింది. కుండీల్లో, వేలాడే కుండీల్లో దీన్ని పెంచుకోవచ్చు. శరదృతువులో ఉష్ణోగ్రత తగ్గటం వల్ల గడ్డికాడలు లేత పసుపు రంగులోకి మారతాయి. పువ్వుల్లో ఉండే చిన్న చిన్న విత్తనాల ద్వారా గానీ, గడ్డి కణుపులు తీసి నాటడం ద్వారా గానీ కొత్త మొక్కలను ఉత్పత్తి చేసుకోవచ్చు.
 

పెన్నిసెటమ్‌ సెటాసియం..

1


చూడగానే ఆహా అనిపించే అందమైన రంగుల గడ్డి పెన్నిసెటమ్‌ సెటాసియం. దీన్ని ఫౌంటెన్‌ గ్రాస్‌ అని కూడా పిలుస్తారు. రెండు నుంచి మూడు అడుగుల వరకు పెరుగుతుంది. గడ్డి లావుగా, మెత్తగా ఉంటుంది. మూడు నుంచి ఐదు అంగుళాల రెల్లులాంటి గుచ్చం ఉంటుంది. ఇసుక నేలల్లో బాగా పెరుగుతుంది. ఇందులో ముదురు ఎరుపు, పింకు, గోధుమ, ఆకుపచ్చ రంగుల్లో పౌంటెన్‌ గ్రాస్‌ లభిస్తోంది. ఇది పూర్తిగా అవుట్‌డోర్‌ వాతావరణంలో పెరుగుతుంది. ఇంటి ముంగిట ప్రహరీగోడకు చేర్చి, ఈ గడ్డిని పెంచితే ఇల్లంతా ఆహ్లాదంగా కనిపిస్తుంది.


జంకస్‌ ఎఫ్యూసస్‌..

3


దర్బ పుల్లల్లాగా గడ్డి కాస్త గట్టిగా ఉండి నిటారుగా ఎదుగుతుంది. అడుగు నుంచి రెండు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కామన్‌ రష్‌ లేదా సాఫ్ట్‌ రష్‌ అని పిలుస్తారు. కుటుంబం జున్‌కేసిలో శాశ్వతమైన గుల్మకాండ పుష్పించే మొక్క జాతి. ఉత్తర అమెరికాలో, సాఫ్ట్‌ రష్‌ అనే సాధారణ పేరు జంకస్‌ ఇంటీరియర్‌ని సూచిస్తుంది.
 

కోర్టాడెరియా సెల్లోనా..
 

1

మూడు నుంచి నాలుగు అడుగుల పొడవు ఉండే గడ్డి కంకులు, రెండు అడుగుల పూల రెల్లి ఉంటుంది. గడ్డి కణుపులు సన్నని గొట్టాల్లాగా స్పైక్స్‌లాగా నిటారుగా పెరుగుతాయి. దీని పూలగుచ్చం దూదిలా మెత్తగా ఉంటుంది. దీన్ని పంపా గ్రాస్‌ అని కూడా అంటారు. ఇది సాధారణంగా నదుల ఒడ్డున ఇసుక తెప్పల్లో పెరుగుతుంది. ఇందులో ఆకుపచ్చ, లేత గులాబీ, గోధుమ రంగులు ఉంటాయి. దీన్ని కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇది పూర్తిగా బయట వాతావరణంలో పెరిగే గడ్డి మొక్క.


తార్రాగన్‌..

3


ఆష్టరేసియా జాతికి చెందిన ఈ గడ్డి మొక్క శాస్త్రీయనామం అర్థెమీసియా డ్రాకన్కకులస్‌. చిన్ని చిన్ని కణుపుల గడ్డి పొట్టిగా పెరుగుతుంది. గడ్డి మొక్క లేతగా నవనవలాడుతూ మెత్తగా ఉంటుంది. గడ్డి మెరుస్తూ కనబడుతుంది. దీన్ని నేలకుండీల్లో, వేలాడే కుండీల్లో పెంచుతూ ఉంటారు. ఎండ, సెమీషేడ్‌ వాతావరణంలో కూడా పెరుగుతుంది. గడ్డి మొక్క చూడ్డానికి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది.


ఆక్రోస్‌ గ్రామీనియస్‌..

5


ఎంతో అందంగా కనిపించే ఈ గడ్డిని జపనీస్‌ స్వీట్‌ ఫ్లాగ్‌, జపనీస్‌ రష్‌, గడ్డి-లేవ్‌ తీపి జెండా, గడ్డి-ఆకు తీపి జెండా అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. జపాన్‌, కొరియా, తూర్పు ఆసియాకు చెందిన అకోరస్‌ జాతికి చెందినది. చిత్తడి నేలలు, లోతులేని నీటిలో పెరుగుతుంది. ఇంటిదగ్గర కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కాకపోతే నీటి వనరు ఎక్కువ అవసరం.