Aug 06,2022 06:17

మనం నిత్యం భుజించే వాటిలో ఆకుకూరలు, కూరగాయలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా శాఖాహారులకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం సమకూరేది కేవలం కాయగూరల ద్వారా అంటే అతిశయోక్తి కాదు. పోషకాహార నిపుణుల ప్రకారం ఒక సమతుల్యమైన ఆహారాన్ని అందుకోవాలంటే, పెద్దవారికి రోజుకు కనీసం 85 గ్రాముల పండ్లు , 300 గ్రాముల కూరగాయలు అవసరం. కానీ, మన దేశంలో ప్రస్తుతం కాయగూరల ఉత్పత్తి అవుతున్న దాని ప్రకారం చూస్తే..రోజు సగటున ఒకరికి కేవలం 120 గ్రాముల కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా ధరల స్థిరీకరణ అనేది ఎక్కడా లేదు. ప్రతి కూరగాయ ధర రెండింతలు మూడింతలు అయిన మాట వాస్తవమే. సామాన్య ప్రజలకు కూరగాయలు అందుబాటులో లేకుండా పోవడం, ఉన్నా ధర ఎక్కువగా ఉండటంతో కొనలేని పరిస్థితి. పెరటి తోటలు, మిద్దె మీద తోటలు పెంచడంతో జీవన శైలిలో మార్పులు గ్రహించవచ్చు. గృహిణులు, పిల్లలు వీటి సంరక్షణ గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. ఒకప్పుడు హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ శాఖల వారు కూరగాయల విత్తనాలు ఇచ్చేవారు. బెండ, గోరుచిక్కుడు, బీర, కాకర, సొరకాయ, మిరప, టమోటా...ఆకుకూరలల్లో పొనుగంటి ఆకు, పాలకూర, చుక్కకూర, కోయగూర, గోంగూర, శిరి ఆకు, కొత్తిమీర, పొదిన ఎలాంటి వాతావరణంలో అయినా వస్తాయి. దీనికి ఎకరాల భూమి అవసరం లేదు. కేవలం ఒకటి రెండు సెంట్ల స్థలంలో అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. పెరటితోటలో మొక్కల పెంపకంపైన చెప్పిన నిజాలను ఆధారంగా తీసుకొని, మనకోసం మనం, ఇంట్లోనే కాయగూరలను ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఇంట్లో వంటగది, స్నానాల గదిలో వృధా అయ్యే నీటిని వాడుకోవచ్చు. దీనివల్ల మన ప్రాణానికి హాని కలిగించే నిలవ నీరు, మరుగు నీరు ఏర్పడదు. అంతేకాక మన కూరగాయల అవసరాలనూ తీరుస్తుంది కూడా. తక్కువ స్థలాల్లో ఎక్కువ కూరగాయల చెట్లను పెంచుకోవడం వల్ల చీడ రాకుండా, ఒక వేళ వచ్చినా సులభంగా చెట్లకు పట్టిన చీడను తొలగించుకొనేందుకు వీలుగా ఉంటుంది. పైగా రసాయనాలను వాడటం ఉండదు కాబట్టి కాలుష్యం ఏర్పడదు. ఇదెంతో క్షేమకరమైన విధానం కూడా. ఎందుకంటే, ఇలా ఉత్పత్తి అయ్యే కూరగాయల్లో మన ఆరోగ్యానికి భంగం కల్గించే ఎరువుల అవశేషాలు ఉండవు. పెరటి తోటల పెంపకానికి ఆగస్టు, సెప్టెంబర్‌ అనుకూలమైన నెలలు. వంటింటి దగ్గర, పెరట్లో వంటింటి తోట ఎక్కడ పెంచాలనే దానికి స్థలం ఎంపిక విషయంలో మనకు పరిమితమైన అవకాశం ఉంది. ఇంటి పెరటి స్థలమే అందరికీ చివరగా అందుబాటులో ఉండే స్థలంగా చెప్పాలి. ఎందుకంటే, ఇంటిలోని వారంతా తమ ఖాళీ సమయాల్లో కూరగాయలపై తగినంత దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ఈ కిచెన్‌ గార్డెన్‌ ఎంత పరిమాణంలో ఉండాలి అనేదాని ఎలాంటి నియమాలు లేవు. ఐతే, మనం ఎంత స్థలం కేటాయించినా, ఎంత మందికి సరిపడా కూరలు ఉత్పత్తి చేసుకోవాలి అనేదానిపై వాటి సైజు నిర్ణయించుకోవాలి. దీనికెలాంటి నిర్ణీత ఆకార నియమాలు కూడా లేవు. అయితే చదరంగా ఉండే దానికన్నా దీర్ఘచతురస్రాకారంగా ఉంటేనే మంచిది. పంట కోతల ఆధారంగా ఒక మూడు సెంట్ల భూమిలో కిచన్‌ గార్డెన్‌ ఆరంభిస్తే, కనీసం 4 నుంచి 5 మంది ఉండే కుటుంబానికి సరిపడా కూరలు పండించవచ్చు. అలాగే బంతి, చామంతి, కనకాంబరం, క్రోటన్‌ పెంచితే ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏడాది పొడవునా నిరంతరం పెరిగే చెట్లు తోటకు వెనకభాగంలో పెంచాలి. దీనివల్ల వాటి నీడ మిగిలిన మొక్కలు పడి వాటికి ఎండ తగలకుండా పోయే ప్రమాదాన్ని నివారించవచ్చు. అలాగే మిగిలిన కాయగూర మొక్కలు కావలసిన పోషకాహారాలను ఇవి లాగేసుకోకుండా కూడా ఉంటుంది. తోట మొత్తానికి ఉండే నడకదారి పక్కన, మధ్య దారి ఇరుపక్కలా తక్కువ వ్యవధిలో పెరిగే కొత్తిమీర, పాలకూర, బచ్చలి, పుదీనా వంటి మొక్కలను వేసుకోవచ్చు.

- డా|| ధర్మవరం ఆషా దేవి,
ఉపాధ్యక్షురాలు, గౌతమ్‌ బుద్ధ అభివృద్ధి సమాఖ్య.