మొన్న మా బెజవాడలో ప్రజారక్షణ భేరి పేరిట సిపియం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరిగాయి. ఆ సందర్భంగా సిపియం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ప్రసంగం గురించి ఒక్కో దినపత్రిక ఒక్కో రకంగా రాసుకొచ్చింది. మోడీ, జగన్ ప్రభుత్వాలను గద్దె దించాల్సిందే అని ఆంధ్రజ్యోతి వార్తాకథనం. ఇంగ్లీష్ మీడియం వలన ప్రయోజనం లేదు: బి.వి.రాఘవులు అని సాక్షి పేపరు కథనం.
సాక్షి పేపరు వార్తా కథనం ఆధారంగా ఫేస్‌బుక్‌లో చాలా మంది రాఘవులు మీదా సిపియం పార్టీ మీదా తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆలోచనాపరులు, అభ్యుదయవాదులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లుగా ఉన్నవాళ్ళు కూడా ఈ దాడిలో ముందు పీఠిన ఉండడం నాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. పై రెండు పత్రికలు ఏ రాజకీయ పార్టీల కొమ్ము కాస్తాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. పత్రికా వార్తా కథనాల మీద ఆధారపడి స్పందించడం కన్నా ఏ యూట్యూబ్ లోనో, గూగుల్ చేసో రాఘవులు పూర్తి ప్రసంగ పాఠం వినో చదివో విమర్శ చేస్తే బాగుండేది. సాక్షి ప్రచురించిన రాఘవులు వ్యాఖ్యను చూసి దొరికాడురా నాయాలూ అన్నట్లు కమ్యూనిస్టులను దళిత ద్రోహులుగానో, పేదల వ్యతిరేకులుగానో ముద్ర వేసేందుకు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. సహజంగానే కమ్యూనిస్టు వ్యతిరేకులు కామెంట్ల రూపంలో ఆ పోస్టుల కింద తమ వ్యతిరేకతనూ అచ్చొత్తేస్తున్నారు.
సరే సాక్షి కథనం ప్రకారమే రాఘవులు ఇంగ్లీష్ మీడియం వలన ప్రయోజనం లేదు అన్నారు అనుకుందాం. దాని అర్ధం ఎవరినీ ఇంగ్లీష్ నేర్చుకోవద్దని కాదే. ఇంగ్లీష్ మాధ్యమంలో చదువులు సరి కాదు అని చెప్పడానికి, అసలు ఇంగ్లీష్ వలన ఉపయోగం లేదని రాఘవులు అన్నారని చెప్పడానికి ఎంత తేడా ఉంది? ఏ ప్రయోజనాలు ఆశించి ఇలా టంగ్ ట్విస్టింగ్‌కు పాల్పడుతున్నారు. పత్రికలకు ఉన్నట్లే ఈ వాదన చేసేవాళ్లకూ రహస్య ఎజెండా ఏదో అన్నట్లు లేదూ వ్యవహారం. ఇంగ్లీష్ రానిదే, లేనిదే లోకం తెల్లారదు అన్నట్లు చేస్తున్న వాదన ఎబ్బెట్టుగా లేదూ. సకల వివక్షతల నుండి, దోపిడీల నుండి విముక్తి కావడానికి ఇంగ్లీష్ మాధ్యమంలో చదవడం ఒక్కటే మార్గం అన్నట్లు ఉన్నాయి ఈ వాదనలు.
మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలి, సెకండరీ స్థాయి నుండి ఇంగ్లీష్ బోధన ఉండాలి, అలానే మన రాష్ట్రంలో ఉర్దూ, తమిళం, మలయాళం వంటి మైనారిటీ భాషల బోధన కూడా కొనసాగాలి అనేది సిపియం పార్టీ వైఖరి. ఇది ఏ రకంగా తప్పో విమర్శించండి, తప్పు లేదు. శ్వేత జాతి దేశాలయిన అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా-వీటి ఉపగ్రహ దేశాలు కొన్నింటి మినహా యూరప్, ఆసియా (సింగపూర్ వినా), మధ్య ప్రాచ్యం మొదలైన దేశాలన్నింటా ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరుగుతుంది. ఉన్నత విద్య, వృత్తి విద్యల కోసం చైనా, జర్మనీ వంటి దేశాలకు ఇతర దేశస్తులు ఎవరు వెళ్లినా వాళ్లకు ఆరు నెలల పాటు అక్కడి మాతృభాష అయిన మాండరీన్, జర్మనీ భాషలు ఉచితంగా, నిర్బంధంగా నేర్పిస్తారు. అట్లాంటిది మన దేశంలో అందునా మన రాష్ట్రంలోనే ప్రాథమిక విద్య నుండి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన జరగాలి అన్న వాదనకు ప్రాతిపదిక ఏమిటో వివరించి సిపియం వైఖరిని ఎండగట్టొచ్చు. స్వీపింగ్ కామెంట్స్, ఓవర్ జనరలైజేషన్లు సకారాత్మక విమర్శ ఎలా అవుతాయి?
చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు ప్రయోగశాలగా మార్చేసిన కాలం నుండి మన విద్యా వ్యవస్థ దారి తప్పింది. హయ్యర్ సెకండరీ స్థాయి నుండి మాత్రమే ప్రయివేటు విద్యా సంస్థల ప్రవేశానికి అనుమతి ఉండేదల్లా ప్రాథమిక విద్యా స్థాయి నుండి ప్రయివేటుకు అవకాశం కల్పించారు. చైతన్య, నారాయణ, రవీంద్రభారతి, కేశవరెడ్డి సంస్థలు ఇంగ్లీష్ మాధ్యమంలో చదివితే తప్ప పిల్లలు ఎందుకూ కొరగారు అనే స్థాయిలో పౌర సమాజాన్ని ప్రభావితం చేశాయి. ఇందుకు ప్రభుత్వ వత్తాసూ ఉంది. అదే చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి సోషల్ సైన్సెస్ చదువులు దండగ అని తేల్చేశారు. ఇంజనీరింగ్ ఒక్కటే రాచబాట అని నిర్ణయించేసి మండలానికో ఇంజనీరింగ్ కాలేజీ ఇచ్చేశారు. ఎక్కువలో ఎక్కువ ఇవి తెలుగుదేశం శాసన సభ్యులవో, ఆ పార్టీ రాజపోషకులవో కావడం గమనార్హం. ఒక్క మన రాష్ట్రంలోనే 272 ఇంజనీరింగ్ కాలేజీలు ఏటా సుమారు రెండు లక్షల మంది ఇంజనీర్లను జాబ్ మార్కెట్ లోకి గుమ్మరించేవి. ఇందులో 10 శాతం మందికి ఉద్యోగాలు దక్కితే గొప్ప. ఆ పది శాతం మందికి చంద్రబాబు గొప్ప దార్శనికుడు అయ్యాడు. కానీ రాష్ట్ర విద్యా వ్యవస్థ అస్తవ్యస్థమయిపోయింది. ఇదంతా చంద్రబాబు బుర్రకు పుట్టిన బుద్ధి కాదు. ప్రపంచబ్యాంకు ఆదేశించింది. చంద్రబాబు ఆచరించాడు. అందుకే నాడు ప్రజాతంత్రవాదులు, సామాజిక అభ్యుదయం కాంక్షించేవారు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అని ఘాటుగా విమర్శించేవాళ్ళు.
ఇవాళ జగన్ కూడా ప్రాథమిక విద్య నుండి ఆంగ్ల మాధ్యమంలో బోధనా పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. అంటే అక్కడికి జగన్ దళితులను, పేదలను ఉద్ధరించడానికి చేస్తున్నారని ఎవరైనా విశ్వసిస్తుంటే వాళ్లు పొరబడినట్లే. 'సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్'స్ లెర్నింగ్ ట్రాన్ఫార్మేషన్' (సాల్ట్) పేరిట ప్రపంచ బ్యాంకు 2000 కోట్ల రూపాయల అప్పు ఇచ్చి మన విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలో ఆదేశించింది (ఆసక్తి ఉన్నవాళ్లు గూగుల్ చేస్తే 97 పేజీల డాక్యుమెంట్ నెట్‌లో దొరుకుతుంది.). ఆ ఆదేశాల్లో భాగమే ప్రాథమిక విద్య నుండి ఆంగ్ల మాధ్యమ బోధన, విలీనాల పేరిట స్కూళ్ల మూసివేతలు, బ్రిడ్జ్ స్కూళ్ల ఎత్తివేతలు.
ప్రపంచ బ్యాంకు తన యాభై ఏళ్ళ చరిత్రలో ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి అప్పు ఇచ్చినా దాని వెనుక పశ్చిమ దేశ ప్రయోజనాలే ఉన్నాయే తప్ప ఫలానా దేశంలో, ఫలానా రాష్ట్రంలో అణగారిన ప్రజానీకాన్ని ఉద్ధరించాయి అని ఒక్కటంటే ఒక్క రుజువు చూపించగలరా ఎవరైనా?! అప్పుడు 'సాల్ట్' పథకంలో భాగంగా జగన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రాథమిక విద్యా స్థాయి నుండి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అచ్చంగా మన రాష్ట్రంలోని పేదలు, దళితులు, అణగారిన వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం అని నమ్మేద్దాం. రాఘవులు విమర్శలు తాలో పొల్లో తేల్చేద్దాం.
వైసిపి ప్రభుత్వం పట్ల అభిమానం ఉందీ, మంచిది, ఉంచుకోండి, పొగుడుకోండి, పేదలు-దళితుల పాలిటి పెన్నిధి అని ప్రచారం చేసుకుంటారా చేసుకోండి. ఎవరికీ ఏ అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. అది మీ హక్కు. జగన్ మీ దృష్టిలో గొప్ప సామాజిక విప్లవకారుడిగా అనిపిస్తున్నాడా దానితో కూడా మాకు పేచీ లేదు. కాకపోతే నిరాధారమైన ఆరోపణలతో కమ్యూనిస్టుల మీద అక్కసు ప్రదర్శిస్తున్నారు చూడండీ అది మాత్రం మా ఎబ్బెట్టుగా ఉంది. కమ్యూనిజం మంచిదే కానీ ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే.. నాయనలారా మీ విప్లవానుకూల విప్లవ వ్యతిరేక పెంపుడు సిద్ధాంతాలు ఉన్నాయే అవి మాత్రం కట్టిపెట్టండి. ఈ దేశపు ఫ్యూడల్ సమాజంలో కొన్ని దశాబ్దాలుగా కంబారితనంలో మగ్గిపోయిన అణగారిన ప్రజానీకం పోరుబాట నడిచి కూలీ, జీతం, కరువుభత్యం లాంటివి సాధించుకుంది ఈ దేశపు ఎర్రజండా అండతోనే. సమరశీల పోరాట స్ఫూర్తితో అణగారిన ప్రజలు సాధించుకున్న ఫలితాలను అంబేద్కర్ రాజ్యాంగ హక్కుగా స్థిరపరిచాడు. సామాజిక చలన సూత్రాల చరిత్రను విస్మరిస్తే మేధావులు దారి తప్పడం, వారి అభిమానులు గొర్రె దాటుకు అలవాటు పడడం ఖాయం. ఇది నివారించదగ్గ విషాదం. కాస్త తట్టుకోండి ప్లీజ్. లెట్ అజ్ హోప్ ఫర్ ద బెస్ట్.
- కె. సత్యరంజన్ ,
సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్.