రేపటి నీ ఆరోగ్యం...ఇవాళ్టి నీ అలవాట్లను బట్టి వుంటుంది. 'ప్రజ్ఞాపరాధౌ మూలం సర్వరోగాణాం-సువిచారో పరమౌషధం' అంటారు. అంటే- 'అన్ని రోగాలకు మూలం అన్నీ తెలిసి పాటించకపోవుట, అన్నిటికన్నా గొప్ప ఔషధం మంచి ఆలోచనలు చేయుట. ఉరుకులు పరుగుల జీవితం... మారిన ఆహారపు అలవాట్లు, అధిక బరువు, పని ఒత్తిడి, కాలుష్యం... వెరసి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆధునిక సాంకేతికత మనిషి కదిలే పనిలేకుండా చేసింది. దీంతో మనిషి జీవనశైలి మారింది. ఆహారపు అలవాట్లలో తేడా వచ్చింది. ఇంటికీ, ఒంటికి, పనికి- సరిపడని పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ఒకప్పటి గట్టితనం లేకుండా పోయింది. కావాలని చేసినా...ఎవరో చేస్తున్నారని చేసినా... మనం చేసే పనులన్నింటికీ ప్రతిచర్య వుంటుంది. చర్యకు ప్రతిచర్య సమాధానం అన్నట్లుగా...ఒత్తిడి, జీవనశైలి-రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. అందుకే 'ఒత్తిడి వంద రోగాల పెట్టు' అంటారు పెద్దలు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ప్రపంచీకరణ తెచ్చిపెట్టిన ఒత్తిళ్లతో హైపర్‌టెన్షన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే, ఈ కేసులు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు వైద్యులు.
హైపర్ టెన్షన్ యువత గుండెను సైలెంట్‌గా పట్టేస్తోంది. మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తోంది. పక్షవాతంతో పాటు జ్ఞాపకశక్తి సన్నగిల్లేలా చేస్తోంది. గుండెజబ్బు, క్యాన్సర్‌లకూ కారణమౌతోంది. చిన్న వయస్సులోనే హైపర్ టెన్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమౌతోంది. ఒకప్పుడు హైబీపీ సమస్యలు వయసు పైబడినవారిలో అధికంగా వుండేవి. ప్రస్తుతం 30ఏళ్ల లోపు వారిని కూడా ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. కొందరిలో జన్యుపరమైన కారణాలు కావొచ్చు... కానీ ఇటీవల జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా యువత దీని బారిన పడుతున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరిని హైపర్‌టెన్షన్ ప్రభావితం చేస్తోంది. 30-79 సంవత్సరాల వయస్సు గల 18.8 కోట్లమంది భారతీయులకు రక్తపోటు వున్నట్లు డబ్ల్యుహెచ్‌ఓ ఒక నివేదికలో వెల్లడించింది. 2023 జూన్ నాటికి దేశంలోని 5.8 మిలియన్ల మంది అధిక రక్తపోటు చికిత్స కోసం 'ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ (ఐహెచ్‌సిఐ)' నమోదు చేసుకుంది. అధిక రక్తపోటు వల్ల గుండెజబ్బులు, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఇటీవల పెరుగుతున్నాయి. ముఖ్యంగా మారుతున్న శైలి, శారీరక శ్రమ తగ్గిపోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం అధిక రక్తపోటుకు దోహదం చేస్తాయి. రోజుకు 5గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు వినియోగం 17-30శాతం వరకు కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. 2025 నాటికి సగటు జనాభాలో ఉప్పు తీసుకోవడం 30శాతం తగ్గించాల్సి వుండగా, డబ్ల్యుహెచ్‌ఓ సూచించిన ప్రిస్క్రిప్షన్‌లోని అనేక భాగాలను భారత్ ఇంకా అమలు చేయలేదు. అంతేకాదు... 2021లో దేశంలోని నాలుగు రాష్ట్రాలలో జరిగిన ఒక అధ్యయనంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో ఉప్పు, చక్కెర అధికంగా వున్నట్లు కనుగొన్నారు.
కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తున్న ఆహార పానీయాలకు దూరంగా వుండాలి. ఆరోగ్యకరమైన. ఆహారాన్ని తీసుకోవడం, ఉప్పును తగ్గించడంపై అవగాహన పెంచాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు దేశీయ పంటలను, ఇంటి వంటలను తీసుకోవడంతో పాటు తగినంత వ్యాయామం చేయడం వల్ల ఈ హైపర్ టెన్షన్ నుంచి బయటపడొచ్చు. అధిక రక్తపోటు వున్నవారు చికిత్స చేయించుకునేలా ప్రోత్సహించడం, రక్తపోటును అదుపులో వుంచుకోవడం చాలా ముఖ్యం. 'నీవు ఎలా మలుచుకుంటే... అలా తయారవుతుంది జీవితం' అంటాడు షేక్‌స్పియర్. జీవితంలో సమతుల్యత దెబ్బతినకుండా ఆనందాన్ని, విజయాన్ని సాధించటమెలాగో నేర్చుకుంటే... చాలావరకు ఈ సమస్యలన్నిటికీ దూరంగా వుండొచ్చు. ఎంతటి కార్యమైనా ప్రయత్నం వల్లే సిద్ధిస్తుంది. 'అజ్ఞానం కన్నా నిర్లక్ష్యం చేసే కీడే ఎక్కువ' అంటాడు ఫ్రాంక్లిన్. ఎంత శక్తి సామర్థ్యాలున్నా నిర్లక్ష్యం వహిస్తే... కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్లే.