'ఉసిరి' అని పేరు వినగానే నోరూరుతుంది. ఇండియన్ గూస్ బెర్రీగా ప్రసిద్ధి చెందిన ఉసిరి శాస్త్రీయ నామం ఫిల్లంతస్ ఎంబ్లిక. సాధారణంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకూ కాయలు కాస్తుంది. కాయల్లో పీచుపదార్థం, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్లు, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, సిట్రిక్ ఆమ్లం, గ్లూకోస్, కాల్షియం, ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయి. అందుకే ఆయుర్వేద మందులు, షాంపూలు, కేశ తైలాలు, తల రంగు, జెల్స్, సాస్‌లు, సలాడ్స్ వంటి అనేక పదార్థాల తయారీలో వాడతారు. చెట్టు నుండి కాయలు, చెట్టు బెరడు, వేర్లు ఉపయోగిస్తారు. పూర్వం ప్రతి ఇంటిలోనూ ఉసిరి చెట్లు ఉండేవి. చలికాలం వచ్చిందంటే రావి, ఉసిరి చెట్ల కింద అందరూ కలిసి వనభోజనాలు చేస్తారు. దేశవాళీ ఉసిరి, రాతి ఉసిరి మనకు తెలుసు. ఇటీవలి కాలంలో ఉసిరిలోనూ కొత్త హైబ్రిడ్ వంగడాలు మార్కెట్లోకి వచ్చాయి. అవేంటో, వాటి గురించి ఈ వారం తెలుసుకుందాం.
- దేశవాళీ..
దీన్నే 'చిన్న ఉసిరి' అనీ అంటాం. కాయలు చారలతో తొనలుదేరి ఉంటాయి. కాయలు పుల్లగా ఉండటంతో వీటి పేరెత్తితేనే నోటిలో లాలాజలం ఊరుతుంది. వీటితో రోటి పచ్చడి, పంచదార కలిపి జామ్ తయారుచేస్తారు. పులుపు కోసం కూరల్లోనూ ఉపయోగిస్తారు.
- డ్వార్ఫ్..
ఈ ఉసిరి ఇళ్ల దగ్గర కుండీల్లోనూ పెంచుకునే సౌలభ్యం ఉన్న హైబ్రిడ్ రకం. ఇది రెండు నుంచి మూడడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. కాయలు దేశవాళీ ఉసిరిలానే ఉండి, గుత్తులుగా కాస్తాయి. దీనికి పెద్దగా నీరు అవసరం లేనప్పటికీ సమతుల్య వాతావరణం అవసరం.
- రాతి ఉసిరి..
దీనినే 'పెద్ద ఉసిరి' అని కూడా అంటారు. కాయలు పరిమాణంలో కొంచెం పెద్దగా ఉంటాయి. విటమిన్ - సి పుష్కలంగా ఉన్న ఔషధీయ రకం. కాయలు పులుపు, వగరు, తీపి మిళితమైన రుచితో ఉంటాయి. విత్తనం నాటిన మూడు సంవత్సరాలకు పూత, కాయ వస్తుంది. వనభోజనాలకు ఈ చెట్టునే ఎన్నుకుంటారు. ఆయుర్వేద ఔషధాల్లో, కేశ తైలాల్లో, ఊరగాయకు ప్రసిద్ధి చెందిన రకం ఇది.
- బి ఎస్ ఆర్ -1..
ఇది ఆధునికంగా హైబ్రిడైజేషన్ చేసిన రకం. సాధారణ ఉసిరి మొక్క కంటే పొట్టిగా ఉంటుంది. రెండున్నర ఏళ్లకే కాపు కాస్తుంది.
- ఎన్.ఏ-7..
ఇదీ హైబ్రిడ్ రకమే. కాయలు బాగా కాస్తుంది. పంట దిగుబడి బాగా ఉండటంతో ఎక్కువ ఈ ఉసిరినే సాగు చేస్తారు. ఈ కాయలకు మార్కెట్లో రేటు ఎక్కువగానే ఉంది.
- శ్రీలంక ఉసిరి..
కాయలు గుండ్రంగా, లేత పసుపు రంగులో ఉంటాయి. పూర్తిగా పండిన తరువాత మెత్తగా ఉండి, తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. ఇవి సాగుబడికి అనువుగా ఉండవు.
- కేశ ఉసిరి..
ఈ రకం ప్రత్యేకంగానే ఉంటుంది. వీటి ఆకులు పుచ్చపాదు ఆకుల్లా, గింజలు ద్రాక్షగింజల్లా ఉంటాయి. కాయలు వాటరీగా ఉండి, నవనవలాడుతూ ఉంటాయి. వాటిపైన నూగు ఉంటుంది. మిగిలిన ఉసిరి రకాల కంటే పులుపు ఎక్కువగా ఉంటుంది.
- అమెరికన్ రెడ్ గూస్ బెర్రీ..
కాయలు ఎర్రగా, వాటరీగా ఉండి, నవనవలాడుతూ ఉంటాయి. వీటి ఆకులు, గింజలు కూడా కేశ ఉసిరినే పోలి ఉంటాయి.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506