Dec 15,2020 07:08

కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటానికి దేశ రాజధాని సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. అయినా రైతుల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తన పంథా విడవనంటోంది. ఈ పరిస్థితుల్లోనే ఆకలిపై 'హంగర్‌ వాచ్‌' అనే సంస్థ చేసిన సర్వే విస్తుగొలిపే నిజాలను బయటపెట్టింది. ఈ బిల్లుల ఆమోదం జరిగితే మన దేశంలో ఆకలి కేకలు విపరీతంగా పెరిగి దేశం అథోగతి పాలౌతుందన్నది నివేదిక సారాంశం.
      ప్రతి నలుగురు దళితులలో ఒక్కరు, ప్రతి నలుగురు ముస్లింలలో ఒకరు లాక్‌డౌన్‌ కాలంలో ఆహార వివక్షను ఎదుర్కొన్నారని సర్వే పేర్కొంది. 'ఆహారం హక్కు' ప్రచారంలో భాగంగా చేసిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. సాధారణ జనజీవనంలో ప్రతి పది మందిలో ఒకరు ఆహార వివక్షను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దేశ జనాభాలో మైనార్టీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని సర్వే చెబుతోంది. 11 రాష్ట్రాలకు చెందిన ప్రజలలో సుమారు 45 శాతం మంది ఆర్థికంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు. రోజుకు ఒకపూట తినడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇది లాక్‌డౌన్‌ ముందు కాలంతో పోల్చుకుంటే ఎక్కువైంది. రుణాలు చేయడంలో సాధారణ ప్రజల కంటే షెడ్యూల్‌ కులాల వారిలో 23 శాతం పెరిగాయని సర్వే గుర్తించింది. సుమారు 74 శాతం మంది దళితుల ఆహార వినియోగం కూడా ఈ కాలంలో అధికంగా తగ్గింది. వీరంతా ఒక్క పూట భోజనంతో అంటే రాత్రి పూట తినకుండా పస్తులున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి సేకరించిన ఈ సమాచారం ఆకలి తీవ్రతను కళ్లకు కట్టినట్లు చెబుతోంది. యు.పి, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు.
       పోస్ట్‌ కోవిడ్‌ సమయంలో ఆకలి, ఆహార భద్రతకు ఎదురైన పరిస్థితిపై అవగాహన కోసం ప్రీ-లాక్‌డౌన్‌ (ఏప్రిల్‌, మే) నెలలో ఉన్న స్థితితో పోస్ట్‌-లాక్‌డౌన్‌ కాలమైన సెప్టెంబరు-అక్టోబరు నెలల పరిస్థితిని పోల్చుతూ ఈ సర్వే జరిగిందని 'హంగర్‌ వాచ్‌' తెలిపింది. ఏప్రిల్‌, మే నెలలో ఆదాయ మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. కేవలం 3 శాతం ఆదాయంతో రోజులు గడపవలసి వచ్చిందని 43 శాతం మంది చెప్పారు. ఆహార వినియోగంలో జార్ఖండ్‌ 82 శాతం, ఢిల్లీ 81 శాతం, రాజస్థాన్‌ 80 శాతం క్షీణతలో ఉంటే పోషకాహార వినియోగంలో అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలు 90 శాతం క్షీణతను ప్రదర్శించాయి.
      ఈ లాక్‌డౌన్‌ కాలంలోనే నాలుగు కార్మిక కోడ్‌లను కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దీనివల్ల అసంఘటిత రంగ కార్మికుల ఉపాధిపోయింది. వేతనాలు లేక ఆహారం కొనుక్కునే స్థోమత దిగజారిందని సర్వే పేర్కొంది. ఇప్పుడు తాజాగా రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులపై కూడా కేంద్రం మొండి వైఖరిని అవలంబిస్తోంది. ఈ పరిణామాలు పరిస్థితిని మరింత దిగజారుస్తాయని నివేదిక హెచ్చ రిస్తోంది. పౌర సరఫరాల కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరికీ పది కేజీల ధాన్యం, కేజీన్నర పప్పుధాన్యాలు, 800 గ్రాముల వంట నూనెను కనీసం మరో ఆరు నెలల పాటు వచ్చే జూన్‌ వరకు అందించాలని, అలాగే ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచాలని 'హంగర్‌ వాచ్‌' సూచిస్తోంది.
(ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌)