Jul 18,2023 10:33

నైరోబీ : ఆఫ్రికాలోని సోమాలియా ద్వీపకల్ప ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ ప్రాంతంలో అనేక నెలల నుంచి కొనసాగుతున్న కరువు కారణంగా సుమారు 23.4 మిలియన్ల మంది ప్రజలు ఆహార అభద్రతలో ఉన్నారని, దాదాపు 5.1 మిలియన్ల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పి) వెల్లడించింది. ఈ ప్రాంతంలో మొత్తంగా 36.6 మిలియన్ల మంది కరువు ప్రభావానికి గురయ్యారని, ఈ ప్రభావాన్ని తగ్గించడానికి 'తక్షణ, దీర్ఘకాలిక చర్యలు' అవసరమని డబ్ల్యూఎఫ్‌పి పేర్కొంది. కరువు కారణంగా ప్రజలు ఆకలి బాధలను ఎదుర్కొనడమే కాకుండా, నిరాశ్రయులయ్యారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సుమారు 3 మిలియన్ల మంది స్థానభ్రంశం చెందినట్లు అంచనా వేసినట్లు తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోవడంతో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొంది. అలాగే ఈ కరువు ప్రభావం సుదీర్ఘకాలం ఉండే అవకాశం ఉందని, ప్రజలు దీని నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిపింది. సోమాలియా, కెన్యాలోని నైరుతి భాగాన్ని 'హర్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా' లేదా సోమాలియా ద్వీపకల్పంగా పేర్కొంటారు. ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ద్వీపకల్పం.