
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా):మెస్, హాస్టల్ ఫీజుల పెంపు నిరసిస్తూ రాజధాని ప్రాంతమైన నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. మెస్, హాస్టల్ ఫీజులు రూ.10 వేలు పెంచడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 300 మంది వరకు విద్యార్థులు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్దకు చేరుకుని అక్కడే బైఠాయించారు. వర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు కొత్తగా సౌకర్యాలేమీ కల్పించకుండానే ఇంత ఫీజు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఇప్పటికే అధికంగా ఫీజులు తీసుకుంటున్నా సరైన సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. ఇదే వర్సిటీలో రెండు రోజుల కిందట భోజనంలో పురుగులు, గుండు పిన్నులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. తాజాగా ఫీజుల పెంపుపై విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. స్పందించిన వర్సిటీ అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.