Oct 02,2023 12:43

ఇంఫాల్‌ : మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన విషయం ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులతో సంబంధమున్న నలుగురు నిందితులను సిబిఐ తాజాగా అరెస్టు చేసింది. అయితే భద్రతా కారణాల రీత్యా అరెస్టైన నలుగురిని వెంటనే అస్సాంలోని గౌహతికి తరలించారు. ఈ హత్య కేసు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, ఆర్మీ బలగాలు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించాయి. ఇంఫాల్‌కు 51 కిలోమీటర్ల దూరంలోని ఏజెన్సీ జిల్లా చురాచంద్‌పుర్‌లో గాలించారు. నిందితులు దొరికిన వెంటనే వారిని హుటాహుటిన ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఆదివారం సాయంత్రం 5.45 ప్రాంతంలో వారిని ఇంఫాల్‌ నుంచి అస్సాంకు తరలించాయి. ఇద్దరు విద్యార్థుల అపహరణ, హత్యకు కారణమైన నిందితులను అరెస్టు చేశామని ముఖ్యమమంత్రి బీరేన్‌ సింగ్‌ కూడా ట్విటర్‌లో ప్రకటించారు. జులైలో కనిపించకుండా పోయిన ఓ యువతి, ఓ యువకుల మృతదేహాల ఫొటోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటర్నెట్‌పై నిషేధాన్ని సడలించడంతో హత్యల విషయం వెలుగులోకి వచ్చింది.