Oct 01,2023 12:02
  • వ్యాన్‌లో పడేసిన పోలీసులు
  • ఉద్రిక్తంగా ఎస్‌ఎఫ్‌ఐ చలో విజయవాడ
  • పలువురి అరెస్టు - సిపిఎం ఖండన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థులపై రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమస్యలు పరిష్కరించాలని అడిగినందుకు పోలీసులతో దమనకాండకు దిగింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, హాస్టల్‌ మెస్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ శనివారం చలో విజయవాడకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వం పోలీసులతో ముందస్తు అరెస్టులకు పూనుకుంది. అరెస్టులను అధిగమించి వందలాది మంది విద్యార్థులు విజయవాడకు చేరుకున్నారు. బీసెంట్‌ రోడ్డు మీదుగా లెనిన్‌ సెంటర్‌, ధర్నాచౌక్‌ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అక్కడే బైఠాయించి శాంతియుతంగా నినాదాలు చేశారు. ధర్నా చౌక్‌ వద్ద ముందుగానే భారీగా మోహరించిన పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో విద్యార్థులు ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బలవంతంగా వారిని ఈడ్చుకుంటూ వ్యాన్‌లో ఎత్తిపడేశారు. విద్యార్థినుల పట్ల మగ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ముందుగా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె ప్రసన్నకుమార్‌, ఎ అశోక్‌లను బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. అనంతరం మిగిలిన వారిని కూడా ఇదే పద్ధతిలో అరెస్టు చేసి విజయవాడలోని వివిధ ప్రాంతాల పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద్‌, సహాయ కార్యదర్శులు కిరణ్‌, వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం సోమేశ్వరరావు, షేక్‌ జాహీదా, సౌమ్య, పెద్దిరాజు, రాము, రంగప్ప, రవి, సూరిబాబు, సమరం, సమీరా తదితరులు ఉన్నారు.
 

                                                       అమలుకు నోచుకొని హామీలు : ప్రసన్న, అశోక్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని, కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె ప్రసన్న కుమార్‌, ఎ అశోక్‌ విమర్శించారు. అసెంబ్లీ జరిగిన ఐదు రోజుల్లో విద్యార్థుల సమస్యల ఊసెత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వంటి వాటిల్లో కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, వీరికి మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. జిఓ 77తో పేద విద్యార్థులను పిజి విద్యకు దూరం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్ల విద్యార్థులు ఆకలి కేకలతో అలమటిస్తున్నా ప్రభుత్వానికి కనపడటం లేదా అని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలను రూ.3 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు.
 

                                                                 అరెస్టులను తీవ్రంగా ఖండించిన సిపిఎం

సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులను అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అజిత్‌ సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు కె ప్రసన్న కుమార్‌, ఎ అశోక్‌, సహాయ కార్యదర్శులు కిరణ్‌, పెద్దిరాజు, వినోద్‌ కుమార్‌ తదితరులను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పరామర్శించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వారిపై కేసులు బనాయించడం అమానుషమని పేర్కొన్నారు. విజయవాడ ధర్నాకు రాకుండా హిందూపురం, పెనుగొండ, మడకశిర, కదిరి, కడప, కర్నూలు తదితర ప్రాంతాల్లో కూడా విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులు చేశారని, ఇది గర్హనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల, హాస్టల్‌ విద్యార్ధుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు.
 

                                                            విద్యార్థుల అరెస్టు సిగ్గుచేటు : కెవిపిఎస్‌

న్యాయమైన సమస్యల పరిష్కారం ఆందోళన చేస్తున్న విద్యార్ధులను అరెస్టు చేయడం సిగ్గుచేటని కెవిపిఎస్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి విమర్శించారు.