Jan 20,2021 06:38

రాష్ట్ర వ్యాపితంగా నేడు అన్ని జిల్లాల లోను, పరిశ్రమల లోనూ కార్మికులు కృష్ణపట్నం పోర్టు కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలియజేస్తున్నారు. పోర్టు కార్మికులు గత 6 మాసాల నుండి పోరుబాటలో ఎందుకున్నారు? వీరికి గొంతెమ్మ కోర్కెలు ఏమీ లేవు. కార్మిక చట్టాలు అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నారు. కార్మిక చట్టాలు అమలు చేయడం యాజమాన్యం బాధ్యత. కానీ కరుడుగట్టిన అదానీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తున్నది. అంతేగాకుండా యూనియనే లేకుండా చేయాలని 500 మంది కార్మికులను కక్షపూరితంగా జనవరి 6 నుండి తొలగించింది.


పోర్టు రాష్ట్రం లోని అత్యంత ప్రధాన పరిశ్రమ. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ తరువాత 12,500 మంది కార్మికులు పని చేస్తున్న రెండో భారీ పరిశ్రమ. 2008లో నెల్లూరు జిల్లాలో వేలాది మంది రైతుల త్యాగాలతో 4,553 ఎకరాల్లో 13 బెర్త్‌లతో నిర్మించిన పోర్టు సాలీనా 40 మిలియన్‌ టన్నుల నుంచి 54 టన్నుల సామర్థ్యంతో నడుస్తూ, వేలాది కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నది. మౌలిక సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి వార్షిక రెవెన్యూలో కేవలం 2.6 శాతం మాత్రమే చెల్లిస్తున్నది. పేరు గొప్ప ఊరు దిబ్బ సామెతలా అత్యంత లాభాలు ఆర్జించే ఈ పరిశ్రమలో కార్మిక చట్టాలేవీ అమలు చేయడంలేదు. భారతదేశంలో బడా పెట్టుబడిదారులు కార్మికులను దోచుకొని అత్యధిక లాభాలు గడించుకోవాలని చూస్తున్నారు. కరోనా సమయంలో దేశంలో 23.8 శాతం ఉత్పత్తి పడిపోయింది. కానీ అదానీ గ్రూపు 700 శాతం అధికంగా లాభాలు ఆర్జించింది. కార్మికులకు అతి తక్కువ జీతాలు చెల్లించడమే ఈ లాభాలకు ప్రధాన కారణం. కార్మికులకు ప్రాథమిక చట్టాలు కూడా అమలు చేయడం లేదు. యూనియన్‌ పెడితే హక్కులు అడుగుతారని యూనియన్లు ఏర్పడకుండా చేయడంలో బడా పెట్టుబడిదారులు బరితెగించి వ్యవహరిస్తున్నారు.


బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు యూనియన్‌ లేకుండా చేయాలని అడ్డదారులు తొక్కుతున్నారు. యూనియన్‌ లేకుండా చేస్తే అడిగేవారే వుండరు. కార్మికులను కట్టు బానిసలుగా పని చేయించుకోవచ్చు. అత్యధిక లాభాలు గడించవచ్చు. సంఘం వుంటే చట్టాలు అమలు చేయాలి. కార్పొరేట్ల కోర్కెలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌' పేరుతో జై కొడుతున్నాయి. విశాఖ లోని ఎల్‌.జి. పాలిమర్స్‌ యాజమాన్యం 1997లో యూనియన్‌ లేకుండా చేసింది. భద్రతా ప్రమాణాలు లేకుండా 15 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. యూనియన్‌ వుంటే ఈ దుస్థితి కలిగేది కాదు. కృష్ణపట్నం పోర్టులో సిఐటియు యూనియన్‌ పెట్టినా యాజమాన్యం సంప్రదింపులు జరపడం లేదు. బ్రిటీష్‌ కాలంలోనే కార్మికవర్గం మహత్తర పోరాటాలు జరిపి 'ట్రేడ్‌ యూనియన్‌ చట్టం-1926' సాధించుకున్నారు. ఈనాడు యజమానులు ఈ చట్టాన్ని అమలు చేయకపోతే కార్మికవర్గం చేతులు ముడుచుకొని కూర్చోదు. కృష్ణపట్నం పోర్టులో కార్మికులు ''సంఘం పెడదాం. సంగతేంటో చూద్దాం'' అని ముక్త కంఠంతో పట్టుదలగా పోరాడుతున్నారు. కార్మికవర్గం ఐక్యంగా పోరాడడం ఒక్కటే దీనికి పరిష్కారం.


కృష్ణపట్నం పోర్టు పాత యాజమాన్యం అదానీ గ్రూపుకు 75 శాతం వాటాలను రూ.12,500 కోట్లకు అమ్మింది. త్యాగాలేమో స్థానిక ప్రజలు, కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వానివి. లాభాలేమో బడా పెట్టుబడిదారులవి. గత 12 సంవత్సరాల నుంచి కార్మిక చట్టాలు అమలు చేయకుండా, కార్మికులతో బానిసల్లా పని చేయించుకుంటున్నారు. రోజూ 12 గంటలు పని చేయించుకొని 8 గంటలకు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు. పండుగ, పబ్లిక్‌ సెలవులేవీ పాటించడంలేదు. ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా కార్మికులకు బోనస్‌ చెల్లించలేదు. సిఐటియు నాయకత్వంలో కార్మికులు గత ఐదేళ్ల నుంచి కార్మిక హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రశ్నించిన కార్మిక నాయకులను, కార్మికులను మాఫియా గ్యాంగ్‌ల ద్వారా బెదిరించడం, అక్రమంగా తొలగించడం, బదిలీలు చేయడం, కేసులు బనాయించడం ద్వారా కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి యూనియన్‌ను అడ్డుకుంటున్నారు. కార్మికులకు పే స్లిప్‌లు, గుర్తింపు కార్డులు లేవు. 12,500 మంది కార్మికుల్లో 12 వేల మంది కాంట్రాక్టు కార్మికులే. వీరిలో 4,760 మందికి మాత్రమే పిఎఫ్‌, ఇఎస్‌ఐ వర్తిస్తోంది. 1200 మంది స్థానిక మహిళలకు రోజుకు కేవలం రూ.170 మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారు. చీప్‌ లేబర్‌ అంటే ఇదే. భూ సేకరణ జరిగినప్పుడు స్థానికులకు ప్రతి కుటుంబానికి ఒక పర్మినెంట్‌ ఉద్యోగం ఇస్తామని చెప్పిన హామీ నేటికీ నెరవేరలేదు.


కృష్ణపట్నం పోర్టు కార్మికుల సమస్యలపై 2020 డిసెంబరు 31న రాష్ట్ర కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీమతి ఉదయలక్ష్మి సమక్షంలో సమావేశం జరిగింది. కార్మిక చట్టాలను అమలు చేస్తామని యాజమాన్యం రాతపూర్వకంగా అంగీకరించింది. కానీ 2021 జనవరి 6న 500 మంది కార్మికులను అక్రమంగా తొలగించింది. ముందుండి పోరాడుతున్న లాజిస్టిక్‌ కార్మికులను తొలగించి యూనియన్‌ లేకుండా చేయాలని యాజమాన్యం కుట్ర చేస్తున్నది. ఈ కుట్రలను వమ్ము చేయాలి. కార్మికవర్గం యొక్క యూనియన్‌ ఏర్పాటు, 8 గంటల పని విధానం వంటి ప్రాథమిక హక్కులు భారీ పరిశ్రమల్లోనే అమలు చేయకపోతే, ఇతర చిన్న పరిశ్రమల్లో అసలు అమలు కావు. కృష్ణపట్నం వంటి భారీ పరిశ్రమల్లో కార్మిక హక్కులు కాపాడుకోవడం యావత్‌ కార్మికవర్గం కర్తవ్యం. పోరాడుతున్న కృష్ణపట్నం కార్మికులకు అండగా వుందాం. జనవరి 20న జిల్లా కేంద్రాలు, పరిశ్రమల దగ్గర నిరసన తెలిపి కృష్ణపట్నం కార్మికులకు సంఘీభావం తెలియజేద్దాం.
డిమాండ్లు ఇవి:

  1. కృష్ణపట్నం పోర్టులో కార్మిక చట్టాలు అమలు చేయాలి.
  2. తొలగించిన 500 మంది కార్మికులను పని లోకి తీసుకోవాలి.

                                                   * సిహెచ్‌. నర్సింగరావు (వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు)