Apr 27,2023 21:40

ప్రజాశక్తి - రణస్థలం (శ్రీకాకుళం జిల్లా) :శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి వద్ద ఉన్న యునైటెడ్‌ బ్రేవరీస్‌ (యుబి) పరిశ్రమను సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు, కుటుంబ సభ్యులు గురువారం ముట్టడించారు. ప్రతి కార్మికుడికి పూర్తిస్థాయి పని దినాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి మాట్లాడుతూ.. యుబి పరిశ్రమ యాజమాన్యం మూడేళ్లుగా కార్మికులకు పూర్తిస్థాయి పని దినాలు కల్పించకపోడంతో 600 మంది కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పరిశ్రమ పని దినాలు కల్పించనిపక్షంలో చట్ట ప్రకారం 50 శాతం వేతనాలు చెల్లించాలని, చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని యుబి యాజమాన్యాన్ని జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌(జెసిఎల్‌) ఆదేశించినా యాజమాన్యం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పరిశ్రమలోకి కార్మికులు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిశ్రమ గేటు వద్ద కార్మికులు బైఠాయించి, నినాదాలు చేశారు.
మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌
కార్మికుల ఆందోళనకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే జి.కిరణ్‌కుమార్‌ మద్దతు తెలిపారు. యాజమాన్యం అందుబాటులో లేదని, వారు వచ్చిన తరువాత కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపిపి పిన్నింటి సాయికుమార్‌, టిడిపి, జనసేన పార్టీ నాయకులు కార్మికులకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యుబి వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఐ.నారాయణరావు, జె.గంగరాజు, నాయకులు పి.సత్యనారాయణ, టి.వెంకటరమణ, భద్రయ్య, చిన్న, కె.రమణ, రాము, తదితరులు పాల్గొన్నారు.