Mar 15,2023 21:07
  • రెండు రోజుల సమ్మెతో దిగొచ్చిన 'గోద్రెజ్‌ ' యాజమాన్యం
  • అక్రమ బదిలీలు నిలిపితేకు అంగీకారం

ప్రజాశక్తి - చింతలపూడి (ఏలూరు జిల్లా) : ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరంలోని గోద్రెజ్‌ పామాయిల్‌ ఆగ్రోవెట్‌ పరిశ్రమ కార్మికులు రెండు రోజులుగా సాగించిన పోరాటం విజయం సాధించింది. పరిశ్రమలో యూనియన్‌ పెట్టారన్న అక్కసుతో యాజమాన్యం కార్మిక నేతలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసి వేధింపు చర్యలకు దిగింది. దీంతో కార్మికులు మంగళవారం రాత్రి నుంచి విధులు బహిష్కరించి ఆకస్మిక సమ్మె చేపట్టారు. ఫ్యాక్టరీ వద్దే టెంట్లు వేసి బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేశారు. కార్మికుల ఆందోళనకు సిఐటియు అండగా నిలిచింది. దీంతో దిగొచ్చిన యాజమాన్యం బుధవారం మధ్యాహ్నం యూనియన్‌ నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల్లో ఇతర రాష్ట్రాలకు అక్రమ బదిలీలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కార్మికులపై కక్షసాధింపు చర్యలు చేపట్టబోమని, మిగిలిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. చర్చల్లో ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర సంజుమాథ్యూ, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ప్రవీణ్‌, యూనియన్‌ నేతలు బాలకృష్ణ, పెద్దిరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

  • ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం : సిఐటియు

చర్చల అనంతరం ఫ్యాక్టరీ వద్ద కార్మికులు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ కార్మికుల ఐక్యత వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఇది ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న కార్మికులకు దిక్సూచి అన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతర సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పి.పెద్దిరాజు, పి.బాలకృష్ణ, నాగరాజు, ఎన్‌.వెంకటేశ్వరరావు, సిఐటియు నేతలు ఎస్‌కె.సుభాషిణి, నత్తా వెంకటేశ్వరరావు, ఆర్‌విఎస్‌.నారాయణ, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.