Aug 27,2023 13:47

బెంగళూరు :    బిజెపి హయాంలో కర్ణాటకలో కొవిడ్‌ నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం ధ్వజమెత్తింది. కొవిడ్‌ సమయంలో మందుల సేకరణ, పరికరాలు మరియు ఆక్సీజన్‌ సరఫరాలో జరిగిన అవతవకలపై విచారణకు ప్యానెల్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. రిటైర్ట్‌ హైకోర్టు జడ్జి జాన్‌ మైఖేల్‌ డి కున్హా నేతృత్వంలో కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదికను సమర్పించాల్సిందిగా శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ఈ కమిటీ విచారణ చేపట్టనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

ప్రజల మరణాలకు దారితీసిన మందులు, పరికరాలు, మరియు ఆక్సీజన్‌ దుర్వినియోగానికి సంబంధించి జులై -ఆగస్టులో పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికలో చేసిన ఆరోపణలను తీవ్రమైనవిగా పరిగణించినట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత శాఖలు దర్యాప్తునకు అవసరమైన పత్రాలు మరియు సిబ్బంది, స్థలం, స్టేషనరీ, వాహనం మరియు కార్యాలయానికి అవసరమైన సామగ్రితో సహా అన్ని సదుపాయాలను అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే అక్రమాలపై న్యాయపరమైన విచారణ జరిపిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.