Oct 29,2023 09:01

మంగుళూరు : కర్ణాటకకు కరువు సహాయం కింద కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయిని కూడా విదల్చలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.17 వేల కోట్లు విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు విజ్ఞప్తి చేసిందని కానీ ఫలితం లేదని అన్నారు. కర్ణాటక పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 116 తాలుకాలు కరువుతో బాధపడుతున్నాయని కేంద్ర బృందం కూడా అంగీకరించిందని, కాగా, రూ.33 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్రం అంచనా వేసిందన్నారు. అయినా ఇప్పటివరకు కేంద్రం నుండి సానుకూల స్పందన లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలకు రూ.50 కోట్లు బిజెపి ఇవ్వచూపిందంటూ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తమ ప్రభుత్వాన్ని అస్థిరీకరించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని తెలుసని, కానీ డబ్బు ఇవ్వచూపినట్లు తెలియదని అన్నారు.