Sep 04,2023 15:59

బెంగళూరు :   కావేరీ నదీ జలాల వివాదంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కోర్టులో పోరాటం చేస్తున్నామని అన్నారు. తమ రైతులను ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసునని చెప్పారు. బిజెపి, జెడిఎస్‌ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వారు 25,000 క్యూసెక్కుల నీటిని డిమాండ్‌ చేస్తున్నారని, అయితే తాము 3,000 క్యూసెక్కుల నీరు ఇచ్చేందుకు ఆమోదించామని అన్నారు. అయితే 5,000 క్యూసెక్కులు ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని, ఈ అంశం కోర్టులో ఉందని అన్నారు. వర్షాలు లేనందున నీటిని తగ్గించాలని కోర్టుకి విజ్ఞప్తి చేశామని చెప్పారు.
కర్ణాటకలోని రిజర్వాయర్ల నుండి రోజుకి 24,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం కూడా గతవారం ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. మిగులు జలాలు ఉన్నప్పుడు తమిళనాడు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని, అయితే ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొంది.