Oct 31,2023 12:01

చెన్నై :   రాష్ట్ర గవర్నర్‌ రవిపై తమిళనాడు ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గవర్నర్‌ రాజకీయ ప్రత్యర్థిగా ప్రవర్తిస్తున్నారంటూ ఆ పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో పరిపాలనను అడ్డుకుంటూ రాజ్యాంగ ప్రతిష్టంభనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం లేదా వెనక్కు పంపడం, రాష్ట్రంలో పరిపాలనను స్తంభింపచేసేలా బెదిరింపులకు దిగడంతో పాటు రోజువారీ కార్యకలాపాలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్‌ ప్రభుత్వం పేర్కొంది. గవర్నర్‌ పార్లమెంటుకు ఓటర్లు ఇచ్చిన రాజకీయాధికారంతో ఆడుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమిళనాడు గవర్నర్‌ రాజ్యాంగ విధులను పాటించడంలో చూపుతున్న నిర్లక్ష్యం, ఆలస్యం, వైఫల్యాలను చట్టవిరుద్ధ చర్యలు మరియు నియంతృత్వంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. గవర్నర్‌ ఆమోదం కోసం అసెంబ్లీ ఆమోదించిన మరియు పంపిన బిల్లులను పరిగణనలోకి తీసుకోకుండా గవర్నర్‌ రవి తన విధులను దుర్వినియోగం చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. గవర్నర్‌/రాష్ట్రపతి 'అనుమతి' ఆ పదవిని చేపట్టిన వారి వ్యక్తిగత ఆలోచనలకు అనుగుణంగా ఉండకూడదని, మంత్రి మండలి నిర్ణయాలపై ఆధారపడి ఉండాలని తెలిపింది. రాష్ట్ర గవర్నర్‌ తన కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు మరియు ప్రభుత్వ ఉత్తర్వులను ఆమోదించేందుకు డెడ్‌లైన్‌ / కాలపరిమితి విధించాలని సుప్రీంకోర్టును కోరింది.