Nov 10,2023 14:29

చెన్నై :   తమిళనాడు బిల్లులను ఆమోదించడంలో గవర్నర్‌ జాప్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్‌ కోసం అభ్యర్థనలను మంజూరు చేయడం, ఖైదీల ముందస్తు విడుదల కోసం అభ్యర్థనలు, తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఖాళీలను భర్తీ చేయడం వంటి బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిస్తున్నట్లు  పేర్కొంది.  హోం మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే అటార్నీ జనరల్‌ లేదా సొలిసిటర్‌ జనరల్‌ విచారణ సమయానికి కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి జాబితా చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవికి వ్యతిరేకంగా అక్టోబర్‌ 30న తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ రాజకీయ ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నారని, పౌరుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని పిటిషన్‌లో పేర్కొంది.