Oct 05,2023 14:59

బెంగళూరు :   కర్ణాటక కాంగ్రెస్‌ నేత, శివమొగ్గ జిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్ (డిసిసి)  బ్యాంక్   అధ్యక్షుడు ఆర్‌.ఎం. మంజునాథ్‌ గౌడ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) గురువారం దాడులు నిర్వహిస్తోంది. తిరుతహళ్లి, శివమొగ్గ జిల్లాల్లోని ఆయన నివాసాలతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపడుతున్నారు.   దీంతో  భారీగా పోలీసుల బలగాలను మోహరించారు.  సెప్టెంబర్‌ 29న ఎన్నికైన మంజునాథ్‌ గౌడ్‌ .. ఆరోసారి  డిసిసి అధ్యక్షుడిగా  పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం డిసిసి  కుంభకోణం విచారణలో భాగంగా ఈ సోదాలు చేపడుతున్నట్లు  ఈడి తెలిపింది.  గౌడ కర్ణాటక ఉప ముఖ్య మంత్రి డి.కె. శివకుమార్ కి సన్నిహితుడు.  ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నారు.   

గతంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి ఎస్‌ యడియూరప్పకు సన్నిహితుడైన  గౌడ 2013కి ముందు కర్ణాటక జనతా పక్ష (కెజెపి)లో చేరారు. కెజిపి  ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు.  అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల తర్వాత యడియూరప్ప కెజిపిని బిజెపిలో  విలీనం చేశారు. దీంతో గౌడ  కెజిపిని వీడి  కాంగ్రెస్ లో చేరారు.