కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్
రూ.333.56 కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్టులు ప్రారంభం
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ విశాఖపట్నాన్ని దేశంలో క్రూయిజ్ టూరిజానికి గమ్యస్థానంగా నిలుపనుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. సాగరమాల కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.333.56 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌తోపాటు మూడు ప్రాజెక్టులను సోమవారం ఆయన విశాఖలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ పోర్టు రాకతో విశాఖ నగరం ఎలా అభివృద్ధి అయ్యిందో వివరించారు. తొలుత ఆయన రూ.33.80 కోట్లతో పోర్టు ఆర్-11 ప్రాంతంలో నిర్మించిన స్టోరేజ్ షెడ్డును ప్రారంభించారు. ఈ షెడ్డు 84 వేల టన్నుల బల్క్ బ్యాగ్ కార్గోలను నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉందన్నారు. అనంతరం ఆర్-1, ఒఆర్-2, ఒఆర్-3 పునరుద్ధరణలో భాగంగా 14.5 మీటర్ల డ్రాఫ్ట్ వెసెల్స్, 85 వేల వెసెల్స్ నిర్వహణకు రూ.167.66 కోట్లతో నిర్మించిన ఒఆర్-1 బెర్తును ప్రారంభించారు. ఈ బెర్త్ 243 మీటర్ల సామర్థ్యంతో, 3.81 ఎంఎంటితో వచ్చే ఏడాది అక్టోబర్ 31కి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. రూ.36.5 కోట్లతో 20 ఎకరాల్లో తలపెట్టిన ప్రపంచ స్థాయి ట్రక్ పార్కింగ్ టెర్మినల్‌ను ప్రారంభించారు. ఈ ట్రక్ పార్కింగ్ టెర్మినల్‌లో 666 వాహనాలను నిలిపి ఉంచవచ్చని తెలిపారు. వంద పడకల విశ్రాంతి గృహం, ఒక ఎటిఎం, తొమ్మిది షాపులు ఇక్కడ నిర్మిస్తామన్నారు. పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.96.5 కోట్ల పెట్టుబడితో నిర్మించిన విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రారంభించారు. దీంతో, 2000 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన క్రూయిజ్ షిప్‌ల నిర్వహణ సులభతరమవుతుందన్నారు. ఈ క్రూయిజ్ లైనర్ నిర్మాణంతో విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి చెన్నరు, కొలంబో, సింగపూర్, బంగ్లాదేశ్‌లకు సేవలు అందించే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. ఇక్కడి తీరాలు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు ఇట్టే ఆకట్టుకుంటాయన్నారు. విశాఖపట్నం పోర్టు, వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ప్రగతి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్, విశాఖ, అనకాపల్లి ఎంపిలు ఎంవివి.సత్యనారాయణ, బివి.సత్యవతి, రాజ్యసభ సభ్యులు జివిఎల్.నరసింహారావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ అంగముత్తు, ఎమ్మెల్యేలు గణబాబు, తిప్పల నాగిరెడ్డి, విశాఖ మేయర్ హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు.