Dec 27,2020 11:59

ఏలికల కన్ను ఎరుపెక్కినప్పుడల్లా
కర్షకుడి గుండె బరువెక్కుతోంది.
నయన సాగరం పోటెత్తి
రైతు బాధ తీరం దాటి ప్రవహిస్తోంది,

ఉత్తరాన ఉదయించిన వేల సూర్యుల గుంపొకటి,
దేశం నడినెత్తిన పిడికిలెత్తి ప్రకాశిస్తోంది,
ఆసేతు హిమాచలం
ఆకుపచ్చ రంగు పులుముకుని ఉగ్రతాండవమాడుతోంది,

దేశానికి పర్యాయపదం ప్రజలే కదా...!
కాదు పాలకులని కొత్తగా లిఖిస్తున్నారు వాళ్ళు.

అవి చట్టాలా...?
బహుళజాతి రాబందుల చుట్టాలా...?
అంటూ గర్జించిన గొంతులను నులిమేసి,
బిగిసిన పిడికిళ్లకు సంకెళ్లు వేసి,
మసిపూసిన మారేడును రైతు నోట్లో కుక్కుతున్నారు.

నంగనాచి మార్జాలమా...
పాలు తాగిందిక చాలు, కళ్ళు తెరువు,
జిత్తులమారి బంధురమా...
జపమిక ఆపేరు,
చేపలేవి లేవిక్కడ, తిమింగలాల సమూహమిది.

ఓ పాలకా....
నేనెవరనుకుంటున్నావు....?
నేనిప్పుడు
తిరగబడ్డ చైతన్యాన్ని,
నేలతల్లి ప్రసవించిన అంకురాన్ని,
మట్టిగుండెలోంచి ఉద్భవించిన ప్రశ్నను,
నలుదిక్కులా మార్మోగుతున్న నినాదాన్ని,
అవును
నేను కర్షకుడిని, దేశ రక్షకుడిని...
                                  * జాబేర్‌ పాషా, 0968 97663604