జెరూసలేం : ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహూకు వ్యతిరేకంగా ఆ దేశంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తీవ్రమైన చలిలోనూ శనివారం జెరూసలేంలోని నేతన్యాహూ నివాసం సమీపంలోని స్క్వేర్ వద్ద వందలాది మంది ప్రజలు గుమిగూడారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ప్లకార్లులు ప్రదర్శించారు. తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో నేతన్యాహూ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో గత ఏడు నెలలుగా వారంవారీ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. నేతన్యాహూపై మోసం, నమ్మక ద్రోహం, పలు సందర్భాల్లో లంచాలు తీసుకునారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రధాని దేశాన్ని నడపలేరని ఆందోళనకారులు స్పష్టం చేస్తున్నారు. ఆయన వెంటనే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కరోనా విపత్తును ఎదుర్కోవడంలో నేతన్యాహూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు. వచ్చే వారంలో నేతన్యాహూపై వస్తున్న ఆరోపణలపై కోర్టు విచారణ చేయనుంది.