Oct 25,2023 09:30

ది హేగ్‌ : గాజాలో యుద్ధనేరాలకు పాల్పడినందుకు గాను ఇజ్రాయిల్‌ ప్రభుత్వాధినేత బెంజమిన్‌ నెతన్యాహుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయ స్థానం ప్రవేశమార్గం ఎదుట పాలస్తీనా అనుకూల కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో, గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ అడ్డూ అదుపు లేకుండా బాంబు దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ ప్రదర్శన జరిగింది. కాగా ప్రదర్శనలో పాల్గొన్న 19 మంది కార్యకర్తలను డచ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం దాటగానే అంతర్జాతీయ న్యాయస్థానం ఎదురుగా గల వంతెనను పాలస్తీనా అనుకూల కార్యకర్తలు స్వాధీనంలోకి తీసుకున్నారు. 'నెతన్యాహు యుద్ధ నేరస్తుడు' అంటూ పతాకాలు చేబూనారు. క్లైమేట్‌ ఎమర్జన్సీ యాక్టివిస్ట్‌ గ్రూప్‌ డచ్‌ శాఖకు చెందిన కార్యకర్తలు అక్టోబరు 7 నుండి పాలస్తీనా అనుకూల కార్యాచరణ చేపడుతునే వున్నారు. అయితే ఈ ప్రదర్శన వల్ల ఐసిసి సాధారణ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని ఐసిసి ప్రతినిధి సోనియా రొబ్లా తెలిపారు. అదుపులోకి తీసుకున్న 19మందిని విడుదల చేసిన తర్వాత, ఐసిసి గ్రౌండ్స్‌ వెలుపల పాలస్తీనా అనుకూల నిరసనల్లో వారు పాల్గొన్నారు.