- ఈజిప్ట్‌తో కలిసి పనిచేస్తామన్న జిన్‌పింగ్
- అబ్బాస్‌కు మోడీ ఫోన్
గాజా/ జెరూసలెం/ న్యూఢిల్లీ : ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఘర్షణలు పెచ్చరిల్లి యావత్ పశ్చి మాసియాకు విస్తరించకుండా చూడడం ముఖ్యమని బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. ఇందుకోసమే పశ్చిమాసియా ప్రాంత నేతలను కలిసి మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పారు. గాజాను అష్ట దిగ్బంధనం చేసి, అక్కడి ఆసుపత్రిపై అమానుష దాడికి దిగిన ఇజ్రాయిల్ చర్యలపై ప్రపంచ వ్యాపితంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో బైడెన్, సునాక్‌లు ఒకరి తరువాత ఒకరు వచ్చి నెతన్యాహకు మద్దతు పలకడం గమనార్హం. పశ్చిమాసియాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగంగానే ఇజ్రాయిల్ దుశ్చర్యలను పశ్చిమ దేశాలు గుడ్డిగా సమర్థిస్తున్నాయి. గాజా ఆసుపత్రిపై దాడి ఇజ్రాయిల్ చేసినట్టుగా లేదని, ఎవరో ప్రత్యర్థుల పనిలా ఉందని బైడెన్ చెప్పిన దానికి కొనసాగింపుగా సునాక్ ఓ ప్రకటన చేశారు. ఇజ్రాయిల్ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో దానికి మద్దతు తెలపడానికి వచ్చానన్నదే ఆ ప్రకటన. ఆకలి దప్పులతోఅల్లాడుతున్న గాజా వాసుల దీన స్థితి గురించి, బాంబు దాడుల్లో కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోతున్న పెను విషాదం గురించి, గాజా వాసులకు అందించాల్సిన మానవతా సాయం గురించి బైడెన్ కానీ, సునాక్‌గానీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. సునాక్ టెల్ అవీవ్‌కు చేరుకోగానే ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్‌తో సమావేశమయ్యారు. హింస మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఆ తరువాత మీడియాకు ఆయన తెలిపారు. మొత్తంగా మధ్య ప్రాచ్యంలో హింస, ఘర్షణలు పెచ్చరిల్లకుండా చూడాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు నొక్కి చెప్పారని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
రష్యా నుంచి 27 టన్నుల సాయం
27టన్నుల సాయాన్ని గాజాకు పంపుతున్నట్లు రష్యా తెలిపింది. మాస్కో నుండి ప్రత్యేక విమానం ఈజిప్ట్‌కు చేరుతుందని, అక్కడ రష్యా మిగతా 5లో మానవతా సాయాన్ని ఈజిప్ట్ రెడ్‌క్రీసెంట్ అధికారులకు అందజేస్తామని డిప్యూటీ మంత్రి ఇలియా డెనిసొవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
మధ్యప్రాచ్యంలో సుస్థిరత కోసం ఈజిప్టుతో కలిసి పనిచేస్తాం : జిన్‌పింగ్
మధ్య ప్రాచ్యంలో మరింత సుస్థిరత నెలకొనేలా చూసేందుకు ఈజిప్ట్‌తో కలిసి పనిచేస్తామని చైనా నేత జిన్‌పింగ్ చెప్పారు. గురువారం ఈజిప్ట్ ప్రధానితో ఆయన మాట్లాడారు. ఈజిప్ట్‌తో సహకారాన్ని పెంచుకుని ఈ ప్రాంతంలో, తద్వారా ప్రపంచంలో మరింత సుస్థిరత తీసుకురావాలన్నది చైనా అభిమతమని ఆయన పేర్కొన్నారు. చైనా, ఈజిప్ట్‌లు మంచి మిత్రదేశాలని, ఒకే లక్ష్యాలను కలిగి వున్నాయని, పరస్పరం విశ్వాసం కలిగి వున్నాయని పేర్కొన్నారు.
పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన మోడీ
గాజా ఆస్పత్రిపై దాడి జరిగిన నేపథ్యంలో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఆ దాడిలో అమాయకులు అసువులు బాయడం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. పాలస్తీనియన్లకు మానవతా సాయాన్ని భారత్ కొనసాగిస్తుందని చెప్పారు. ఆ ప్రాంతంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, హింస, తీవ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారత్ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న సూత్రబద్ధ వైఖరిని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని భారత్ పిలుపిచ్చింది.
జోర్డాన్, ఈజిప్ట్ చర్చలు
మరోవైపు రాఫా క్రాసింగ్ మీదుగా మానవతా సాయాన్ని అనుమతించేందుకు వీలుగా గాజా క్రాసింగ్ వద్ద దెబ్బతిన్న రోడ్లను ఈజిప్ట్ మరమ్మత్తు చేస్తోంది. జోర్డాన్ రాజుతో గురువారం ఈజిప్ట్ అధ్యక్షుడు సిసి భేటీ అయ్యారు. గాజాలో క్షీణిస్తున్న పరిస్థితులను చర్చించారు. పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఉమ్మడిగా శిక్షను అమలు చేస్తున్న ఇజ్రాయిల్ విధానాన్ని వారు ఖండించారు. పాలస్తీనియన్లను వారి ఇళ్ల నుండి వెళ్లగొట్టి ఈజిప్ట్‌కు, జోర్డాన్‌కు పంపేయాలని చూస్తోందని విమర్శించారు. గాజాపై దాడుల గురించి టర్కీ, ఈజిప్ట్ మంత్రులు కూడా చర్చించారు.
ఇజ్రాయిల్ దాడిలో ముగ్గురు పాలస్తీనా వాసుల మృతి
గాజాలో రక్తపాతం సాగిస్తున్న ఇజ్రాయిల ఇంకా బుల్లెట్ల వర్షం కురిపించి, పాలస్తీనియన్లను బలితీసుకుంటోంది. గురువారం వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిలీ బలగాలు జరిపిన కాల్పుల్లో 14 ఏళ్లు, 16 ఏళ్ల వయసున్న టీనేజర్లుసహా ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు.