ఏరు ''ఉల్లీ''
ఎందుకే నీకంత పొగరు?
గులాబీ వలువల్లో
గుప్పుమనే వంటింటి రాణివనా?
ఎంత ప్రియమైనా
నువ్వంటే అందరికీ ప్రియమనా!
నల్లబజారులో
విశ్రాంతి తీసుకుంటూ
నిలకడలేని
వయ్యారాల జోరుతో
ఆకాశ కుసుమమై అలరారుతూ
చుక్కలు చూపిస్తున్నావు కదే!
అందరినీ నీ మోజులో పడేసి
అన్ని వంటకాలలో
నువ్వు లేని దిక్కులేక
ఊరిస్తూ ఉడికిస్తూ
ఎన్ని కష్టాలు తెస్తున్నావే!
అయినా..
ఎవర్ని సుఖపడనిచ్చేవు?
ఆరుగాలం పెంచిపోషించిన
అన్నదాతకు గిట్టుబాటుధర లేక
కన్నీరు పెట్టించావు
కొనుగోలు దారుడికి
కొనబోతే కొరివయ్యావు
నీడన కూర్చొన్న
దళారీకి వరమయ్యావు
పార్టీలకు
ప్రచారాస్త్రమయ్యావు
సెలబ్రిటీ అయ్యావుగా
ఇక ఆపు నీ వేషాలు.
రా...దిగిరా...వడివడిగా
సామాన్యుని చెంతకు...
* వేమూరి శ్రీనివాస్, 9912128967