వాషింగ్టన్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన ట్రంప్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చైనాను, కమ్యూనిస్టులను బూచిగా చూపేందుకు విఫల యత్నం చేస్తోంది. దీనిలో భాగమే కమ్యూనిస్టు పార్టీ లేదా నిరంకుశ పార్టీల్లో కానీ, వాటికి అనుబంధంగా ఉన్న సంస్థల్లో కానీ సభ్యులుగా ఉంటే వారికి అనుమతి నిరాకరించాలంటూ అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) ఇటీవల జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు. అమెరికన్లలో చైనా వ్యతిరేకతను, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టి ఆ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలన్న దుర్బుద్ధి కూడా దీని వెనుక ఉంది. అమెరికా ప్రయోజనాలను కాపాడే గొప్ప రక్షకుణ్ణి తానేనన్నట్లు చెప్పుకోవడానికి విదేశీయులను లేదా కమ్యూనిస్టులను బూచిగా చూపడం ట్రంప్‌కు అవసరం. 2017లో వివిధ ముస్లిం దేశాలపై ఇదే విధమైన ఆంక్షలను ట్రంప్ సర్కార్ విధించింది. జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగించుకుని కొన్ని గ్రూపులను, జాతులను, వ్యక్తులను నిషేధించిన చరిత్ర అమెరికాకు ఉంది. ముస్లిం దేశాలపై నిషేధం విధించినట్లుగా కమ్యూనిస్టు పార్టీల సభ్యులపై నిషేధం విధించడం ఆచరణ సాధ్యం కాదని పలువురు పరిశీలకులు చెబుతున్నారు. అయినా, అమెరికా రక్షణ, జాతీయ భద్రత పేరుతో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు లేదా ఆ నేపథ్యం ఉన్నవారికి అనుమతి నిరాకరించాలని, దేశంలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి దీనిని వర్తింపజేయాలని యుఎస్‌సిఐఎస్ మార్గదర్శ కాలు చెబుతున్నాయి. ఏదైనా మినహాయింపు ఇస్తే తప్ప అమెరికాలో ఉంటున్న, లేదా బయట దేశాలనుంచి వచ్చే కమ్యూనిస్టు పార్టీ సభ్యులకు ఎవరికీ సాధారణంగా అనుమతి ఇవ్వరాదని అది సర్కులర్ జారీ చేసింది. ఎవరు కమ్యూనిస్టో ఎవరు కాదో పరిశీలించే పద్ధతి అమెరికాకు ఉందా? ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులు ఎంత మంది ఉన్నారో తెలుసా? ఒక్క చైనాలోనే 9.2 కోట్ల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఉన్నారు. ఇతర దేశాల్లో ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్లందరినీ నిషేధించడం ట్రంప్ తరమా? ఒక వేళ అందరినీ నిషేధిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ బతికి బట్ట కట్టగలదా? అమెరికాలోని అతిపెద్ద విదేశీ విద్యార్థుల బృందం చైనాదే. ఈ విద్యార్థుల నుంచే అమెరికా విశ్వవిద్యాలయాలకు పెద్దయెత్తున ఆదాయం వస్తుంది. వీళ్లు లేకుంటే అమెరికా టూరిజం కూడా వెలవెలబోతుంది. హ్యూవే, టిక్‌టాక్‌పై నిషేధం విధించారు. ఏమైంది. అమెరికా ఆర్థికాభివృద్ధిలో విదేశీయుల మేథో సంపత్తి నిర్వహిస్తున్న పాత్ర గురించి ట్రంప్ ఎందుకు మాట్లాడరు? ట్రంప్ విధించే నిషేధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.