ఈ భూమ్మీద
భూమిని కన్నతల్లిగా మార్చేవాడు
మట్టి స్తన్యంలోంచి
అన్నం పుట్టించేవాడు అసలైన మనిషి
అతని సహచరులు
నిజమైన పనిమంతులు -
అతని వత్తి వ్యవసాయం
ప్రవత్తి పాల ఉత్పత్తి
దుక్కిని రెండుగా చీలుస్తూ
చక్కగా ''తొలి కొండ్ర'' వేయడం
ఎంత గొప్ప సజనాత్మకత
పొలం దున్నడం
ఒక విత్తనం వందల,వేల విత్తనాలవ్వడం అపురూపమైన కళా రూపం
నిజంగా, ఆకుపచ్చని నేలకన్నా
అందమైనది - లలితమైనది ఎక్కడుంది ?
పళ్లెంలో పది రకాలు వడ్డించినప్పుడు
ఇష్ట పదార్థాల సౌందర్యానికి, ప్రియమైన రుచికి అబ్బురమై
విందు భోజనం గురించి విస్తుపోతూ
నలుగురం చెప్పుకోవడం వెనుక
ఇన్ని వంటలు తింటూ జీవించడం వెనుక
ఉంది ఆ మనిషి,
ఆ మనిషి వెనుక అనేకమంది!
అతని బతుకుని
ఇంత దుఃఖంగా మార్చినవాడు
ఎంతటి వాడైన చరిత్ర హీనుడే, క్షుద్రుడే !
ఆ మనిషి - ఇంకా అనేకమంది
చెమట చింది లభించిన ఫలం,
చాకిరి ఫలితం
వారికి -చెందకపోవడం గురించి
తరతరాల మోసం గురించి మాయ గురించి
మాట్లాడాలి.
మన ఆదిమ కళాకారుణ్ణి మనం బతికించుకోవాలి
సంపద సష్టికర్త సంపన్నుడు కావాలి
* రవి నన్నపనేని, 9182181390