కైఫీ యాసిడ్ దాడిలో కంటి చూపు కోల్పోయింది. చదువుకోవడమే గొప్ప అనుకునే పరిస్థితి నుంచి స్కూల్లో ఫస్ట్ క్లాస్‌లో నిలిచింది. చదువులోనే కాదు...ఏ ఇతర పోటీల్లో పాల్గొన్నా బహుమతి సాధించాల్సిందే. బాల్యం నుంచి ఐఎఎస్ కావాలని కలలు కంటోంది. ఆ పట్టుదలే వైకల్యాన్ని జయించి పదవ తరగతిలో 95.2% స్కోర్ చేసింది. తోటి విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది.
చండీగఢ్‌లో హిసార్ గ్రామానికి చెందిన కైఫీ మూడేళ్ల వయస్సులో యాసిడ్ దాడికి గురైంది. ఊహించని ఘర్షణల మధ్య ఆ బాలికపై ముగ్గురు వ్యక్తులు యాసిడ్ బాటిల్స్ విసిరారు. దాంతో ఆమె ముఖం కాలిపోయింది. చూపు పోయింది. కైఫీ వైద్యం కోసం తల్లిదండ్రులు పవన్, సుమన్లు తిరగని ఆసుపత్రి అంటూ లేదు. కంటి చూపు వైద్యం కోసం చాలా ఖర్చు పెట్టారు. అయినా లాభం లేకపోయింది. కఫీ ఎప్పటికీ చూడలేదని చెప్పారు వైద్యులు. దాంతో తల్లిదండ్రులు నిరాశకులోనయ్యారు. కఫీ భవిష్యత్తు అంధకారం అయ్యిందని బాధపడ్డారు. ఎలాగైనా కఫీని చదివించాలని, ఆమెకు ఓ మంచి జీవితం అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకు సరైన విద్యను అందించాలనుకున్నారు.
ఆమె తండ్రి చండీగఢ్‌లోని హరయాన్‌లో శాస్త్రినగర్‌కు కుటుంబాన్ని మార్చాడు. ప్రసిద్ధి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్ సెక్టార్ స్కూల్లో కైఫీని చేర్పించారు. దృష్టిలోపంతో ఉన్న తను బ్రెయిలీ లెటర్స్‌తో చదువుకుంది. సైన్ ల్యాంగెజ్‌తో చాలా పుస్తకాలు చదివింది. చదువులో కైఫీ చురుకుదనం చూసి ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రోత్సహించేవారు. తండ్రి స్థానికసెక్రటేరియట్‌లో ఫ్యూన్‌గా చేస్తున్నారు. వచ్చేది తక్కువ ఆదాయమైనా తనకి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. తండ్రి చూపే శ్రద్ధ, ప్రేమ ఆమెలో పట్టుదలను పెంచాయి. ఆటల పోటీల్లో గానీ, సైన్సు, పోటీ పరీక్షల్లో ఫస్ట్ ఫ్రైజ్ సాధించేది. చిన్నప్పటి నుంచి ఐఎఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా రోజులో ఆరు గంటలు చదువుకునేది. ప్రతి సంవత్సరం క్లాస్‌లో మంచి మార్కులు సాధించేది. ఈ నెల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 95.2% స్కోర్ చేసి పాఠశాల్లో టాపర్‌గా నిలిచింది. కైఫీపై యాసిడ్ దాడిచేసిన ముగ్గురూ దోషులుగా గుర్తించారు. శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. ఇవి 'నాకు అనవసరమైన విషయాలు. ఐఎఎస్ కావడమే నా లక్ష్యం' అంటున్న కైఫీ ఇప్పటి యువతరానికే కాదు ప్రతిఒక్కరికి స్ఫూర్తి.











