అమరావతి : సాధారణంగా నాన్‌వెజ్ ప్రియులు ఎక్కువమంది ఉంటారు. కోడిగుడ్లు, చికెన్, చేపల ధరలు మార్కెట్ ను అనుసరించి పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కానీ ఈ అంచనాలన్నిటినీ కరోనా తలక్రిందులు చేసింది. కోవిడ్ నేపథ్యంలో.. చికెన్, కోడిగుడ్ల వినియోగం దేశవ్యాప్తంగా పెరిగింది. కరోనాను జయించేందుకు కావల్సిన రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు జనం ఎక్కువగా వీటినే కొంటున్నారు. ఇందుకు వైద్యుల సూచనలు కూడా ఊతమిచ్చాయి. చికెన్, కోడిగుడ్ల వినియోగం ఎక్కువవడంతో, వాటి అమ్మకాల విలువ కూడా ఊపందుకుంది. రేట్లు మండిపోతున్నాయి.
లాక్‌డౌన్ కు ముందు వారానికి ఒక్కసారి మాత్రమే చికెన్ ను తినే కుటుంబాలు.. ప్రస్తుతం వారానికి 2, 3 సార్లు కొంటున్నాయని అమ్మకందారులే తెలిపారు. చికెన్, కోడిగుడ్లు గిరాకీ అందుకొని వాటి రేట్లు కూడా గరిష్టస్థాయికి చేరాయి. లాక్‌డౌన్ కు ముందు రోజుకు 1.80 కోట్ల కోడి గుడ్లు అమ్ముడయితే.. ప్రస్తుతం రోజుకు 2 కోట్ల గుడ్లు అమ్ముడవుతున్నాయి. ! కోడి గుడ్డు ధర చిల్లర మార్కెట్‌లో రూ.5 నుండి రూ.6 కి చేరింది. ఇక చికెన్ విషయానికొస్తే.. ఆదివారం కిలో చికెన్ ధర గరిష్టంగా రూ.260 వరకు పలికింది. కేవలం నెలరోజుల్లోనే కిలో చికెన్‌కు అదనంగా రూ.50 వంతున రేటు పెరిగింది. ఇళ్లలో కోడిగుడ్డు, చికెన్ ల వినియోగం పెరగడం వల్ల వాటి ధరలు కూడా పెరుగుతున్నాయని.. అయినప్పటికీ ఈ రేట్లు స్వల్పకాలమే ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలంగాణ కోళ్ల పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చెప్పారు. ఏదిఏమైనా చికెన్, కోడిగుడ్లు, ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. సామాన్యులకు వాటి కొనుగోలు కష్టతరంగానే ఉందని చెప్పవచ్చు.