అమరావతి : కోడి కొండెక్కింది.. ఇప్పట్లో దిగేలా లేదు.. వారానికి రెండు రోజులైనా చికెన్ లేనిదే ముద్ద దిగనివారికి ఇది మరింత బాధాకరమైన వార్త అనే చెప్పాలి. ఎండాకాలం కారణంగా... ఓ వైపు ఉత్పత్తి తగ్గింది.. మరోవైపు కోళ్లు చనిపోతున్నాయి. కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ఇంకేముంది... వెరసి ఇప్పుడు చికెన్ ధర రికార్డు స్థాయిలో విపరీతంగా పెరిగిపోయింది.
కెజి చికెన్ ఏకంగా రూ.350...
సామాన్యులకు అందుబాటు రేటులో ఉండే చికెన్ ఇప్పుడు మటన్ రేటుతో పోటీపడుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మాంసం కొనాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. నిన్నటి వరకు కెజి రూ.200 పలికిన చికెన్ ధర... ఇప్పుడు ఏకంగా కేజీ రూ.350కు చేరింది. లైవ్ బర్డ్ కిలో రూ.188 వరకు విక్రయించారు. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 5 లక్షల నుంచి 7 లక్షల కేజీల చికెన్ విక్రయిస్తుండగా.. గత ఆదివారం ఏకంగా 50 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరిగినట్లు అమ్మకందారులు చెబుతున్నారు.
గిరాకీ పెరగడం కూడా కారణమే..!
గత రెండు రోజులుగా మృగశిర కార్తె నేపథ్యంలో... చికెన్‌కు గిరాకీ పెరగడం కూడా రేట్ల పైకి ఎగబాకడానికి కారణంగా చెప్పవచ్చు. వేసవి కావడంతో ఫంక్షన్లు, వివాహాలు పెరిగిపోవడంతో చికెన్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం రిటైల్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.350 పలుకగా.. కాలనీలు, బస్తీల్లో ఈ రేట్లు మరింత మండిపోతున్నాయి. ఇక స్కిన్‌తో ఉన్న చికెన్ కూడా రూ.280 వరకు అమ్ముతున్నారు. గత వారం రోజుల్లో కిలో చికెన్ ధర రూ.50 నుంచి 60 వరకు పెరిగింది మరి.