Jun 12,2023 08:50
  • కేజీ చికెన్‌ ధర రూ.320
  • నెల రోజుల్లో రూ.100పైగా పెరుగుదల

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : చికెన్‌ ప్రియులకు ధరల షాక్‌ తగిలింది. మార్కెట్‌లో చికెన్‌ కొనాలంటే ముందు పర్సును ఒకటికి రెండుసార్లు తడుముకోవాల్సి వస్తోంది. రికార్డు స్థాయికి చికెన్‌ ధర చేరుకుంది. తాజాగా ఆదివారం మార్కెట్‌లో కిలో చికెన్‌ ధర ఏకంగా రూ.320కి చేరింది. స్కిన్‌లెస్‌ రూ.340 పలుకుతోంది. గత నెల 10వ తేదీన కిలో చికెన్‌ ధర రూ.210 ఉంది. గత నెలలో కోడి (లైవ్‌) కేజీ ధర రూ.120 కాగా, ప్రస్తుతం అది రూ.166కు చేరింది. గత కొన్ని రోజులుగా రోజురోజుకూ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్యులకు చికెన్‌ అందుబాటులో లేకుండా పోయింది.
 

                                                                          ఎండలతో తగ్గిన ఉత్పత్తి

ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌ దాటితే కోళ్లు తట్టుకోలేవు. జూన్‌ ఒకటి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. సరాసరిన 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుండడంతో వేడికి తట్టుకోలేక అవి చనిపోతున్నాయి. మరోవైపు దంబోరా వ్యాధి కోళ్ల పరిశ్రమలను వెంటాడుతోంది. నెల రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 30 శాతం అంటే, సుమారు 30 లక్షల వరకూ కోళ్లు చనిపోయినట్లు రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో లేయర్‌ కోళ్ల కన్నా బ్రాయిలర్‌ కోళ్లకే డిమాండ్‌ ఎక్కువ. లేయర్‌ కోళ్లు కొంతవరకూ ఎండను తట్టుకుంటున్నా బ్రాయిలర్‌ కోళ్లు మాత్రం ఎక్కువగా చనిపోతున్నాయి. దీంతో, డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేక వ్యాపారులు ధర పెంచేశారు. రైతులు నష్టాలను పూడ్చుకునేందుకు తక్కువ బరువు ఉండగానే వచ్చినకాడికి కోళ్లను అమ్ముకుంటున్నారు. కొంతమంది రైతులు వేసవి దృష్ట్యా ఉత్పత్తిని ఆపేశారు. మరోవైపు కార్పొరేట్‌ సంస్థల నుంచి పోటీని స్థానిక పౌల్ట్రీ రైతులు తట్టుకోకపోతున్నారు. కార్పొరేట్‌ కంపెనీల నుంచి దిగుమతి అవుతున్న కోళ్లతో పోల్చితే లోకల్‌ కోళ్లు తక్కువ బరువు ఉంటున్నాయి. దీంతో, దళారులు అడిగిన ధరకు రైతులు విక్రయించక తప్పడం లేదు.
 

                                                                 రోజుకు కోటికిపైగా కోళ్ల ఉత్పత్తి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 350కిపై కోళ్ల ఫారాలు ఉన్నాయి. 1.40 లక్షల గుడ్డుపెట్లే కోళ్లు, బాయిలర్‌ కోళ్లు రోజుకు కోటికిపైగా ఉత్పత్తి అవుతున్నాయి. దాణా ధరలు, విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెరగిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఆక్వా రంగానికి ఇచ్చినట్లు తమకూ రాయితీ విద్యుత్‌ ఇవ్వాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

                                                                        ప్రభుత్వం ఆదుకోవాలి

మండుతున్న ఎండలు ఓ వైపు, దంబోరా వ్యాధి మరోవైపు పౌల్ట్రీ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని పౌల్ట్రీలలో బ్యాచ్‌లకు బ్యాచ్‌లే కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ నష్టం నుంచి కోలుకునే పరిస్థితి లేదు. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో చికెన్‌, గుడ్లు ధరలు పెరిగాయి. మరోవైపు దాణా ధరలు, విద్యుత్‌ ఛార్జీలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి.
                - పడాల సుబ్బారెడ్డి, అధ్యక్షులు
      అనపర్తి ప్రాంతీయ కోళ్ల రైతుల సమన్వయ సంఘం

 

                                                                  చికెన్‌ కొనలేకపోతున్నాం

చికెన్‌ తినాలంటే చుక్కలు కనపడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగాయి. ఎండా కాలంలో ధర పెరగడం పరిపాటి. అయితే, ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ పెరగలేదు. గరిష్టంగా రూ.300కు మించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కేజీ చికెన్‌ రూ.320కు చేరింది. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని అంటున్నారు.
                              - కె. రామారావు, కూలీ, నటరాజ్‌ సెంటర్‌ రాజమహేంద్రవరం