Nov 20,2023 11:05

  • రిటైల్‌ రూ.180, లైవ్‌ రూ.140
  • కార్తీక మాసం ఎఫెక్ట్‌
  • నష్టాల బాటలో పౌల్ట్రీ రైతులు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : చికెన్‌ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. రిటైల్‌ ధర రూ.180 కాగా, లైవ్‌ చికెన్‌ రూ.140 మించడం లేదు. ఇందులో పౌల్ట్రీ రైతుకు రూ.108 మించి దక్కడం లేదు. కార్తీకమాసం వల్ల ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉండడంతో డిమాండ్‌ లేక ధరలు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న మేత ధరలు, విద్యుత్‌ ఛార్జీలకు తోడు కోళ్ల ధర నిలకడగా లేకపోవడం వంటి పరిణామాలతో పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏడాదిలో మూడు నెలలు మాత్రమే ఆశాజనకంగా ఉంటోంది. కోళ్ల పెంపకానికి అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయానికి సరిపోతోందని, తమకు శ్రమకు ఫలితం దక్కడం లేదని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయం తరువాత పెద్ద పరిశ్రమగా పౌల్ట్రీ ఉంది. సుమారు 300 పౌల్ట్రీలు ఉన్నాయి. దాదాపు 1.40 కోట్ల కోళ్ల పెంపకం సాగుతోంది. కిలో కోడి పెంపకానికి, మార్కెట్‌ చేర్చడా నికి రవాణా ఖర్చు కలిపి రూ.120 వరకూ అవుతోంది. కేజీ బాయిలర్‌ కోడి రైతు ధర రూ.108, రిటైల్‌ ధర రూ.140 ఉంది. కేజీ చికెన్‌ ధర రూ.180 కాగా, స్కిన్‌ లెస్‌ రిటైల్‌ మార్కెట్లో రూ.200 చొప్పన విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలో సరాసరి ఐదు కోట్ల కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు అంచనా. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాటా 28 శాతం. ప్రత్యక్షంగా 20 వేలమంది, పరోక్షంగా మరో 20 వేల మంది మొత్తం 40 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ పరిశ్రమ వల్ల లారీ పరిశ్రమకు కూడా ఉపాధి లభిస్తోంది. రైతుల వద్ద కోళ్లను కొనుగోలు చేసి వ్యాపారులు ఒడిశా, బీహార్‌, బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు లారీల్లో ఎగుమతి చేస్తుంటారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పౌల్ట్రీలకు ప్రోత్సాహం ఇస్తున్నాయి. దీంతో, అక్కడ పౌల్ట్రీలు గణనీయంగా పెరిగాయి. ఈ ప్రభావం జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. గత రెండేళ్లుగా కోళ్ల ఫారాలలో బ్యాచ్‌లు వేసేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఏటా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, రాబడి క్రమక్రమంగా తగ్గిపోవడమే ఇందుకు కారణమని రైతులు చెబుతున్నారు. కోడి పిల్ల ధర రూ.35 కాగా, లేబర్‌ ఛార్జీ రూ.6, మెడిసిన్‌ ఖర్చు రూ.10, కరెంట్‌ బిల్లు రూ.1, వరి పొట్టుకు రూ.5, ఇతర ఖర్చులు రూ.3, ట్రేడర్‌ తరుగుదల కింద రూ.40 చొప్పున మొత్తంగా రెండు కిలోల కోడి పెంపకానికి రూ.240 ఖర్చు అవుతోంది. కిలో లైవ్‌ కోడి రూ.130 చొప్పున విక్రయిస్తే కొంతమేర ఆశాజనకంగా ఉన్నట్లేనని రైతులు చెబుతున్నారు. కోళ్లఫారంలో పది వేల కోళ్లను పెంచితే కోడికి (2 కిలోలు) రూ.240 చొప్పున రెండు నెలలకు సుమారు రూ.24 లక్షల ఖర్చవుతుంది. కోళ్ల పెంపకానికి మొక్కజొన్న, సోయా దాణాను అధికంగా వాడుతుంటారు. మొక్కజొన్న దాణా ధర టన్నుకు ఏడాదిలో రూ.18 వేల నుంచి రూ.25 వేలు, సోయా రూ.50 వేల నుంచి రూ.80 వేలకు పెరిగింది. కోడి ధర పెరగకపోవడంతో తమ శ్రమంతా వృథా అవుతోందని రైతులు వాపోతున్నారు. సాధారణంగా రెండు కిలోల కోడిగా ఎదిగేందుకు రెండు నెలల సమయం పడుతుంది. ఈ కాలంలో కోడి మూడున్నర కిలోల దాణా తింటుంది. కిలో దాణాకు రూ.60 చొప్పున మూడున్నర కిలోలకు రూ.210 వరకు ఖర్చు అవుతుంది.

                                                           అత్యధికమంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు

చికెన్‌ ధరలు గత కొంతకాలంగా ఆశాజనకంగా లేవు. ఏడాదిలో రెండు లేదా మూడు నెలలు మాత్రమే గిట్టుబాటు ధర వస్తోంది. మిగిలిన కాలమంతా నష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం లైవ్‌ కేజీ రూ.108 చొప్పున కొనుగోలు జరుగుతోంది. ఈ ఏడాది అత్యధికమంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. లేనిపక్షంలో ధరలు ఇంకా నేలను తాకేవి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో పౌల్ట్రీ రంగం నష్టపోవడంతోపాటు అనుబంధ రంగాలపైనా ప్రభావం చూపుతోంది. ఉపాధి దెబ్బతింటోంది.
 

- బి.హరిదుర్గాప్రసాద్‌,
చికెన్‌ హోల్‌సేల్‌ వ్యాపారి