Feb 26,2023 11:35

రాంచీ  :   నాలుగువేల కోళ్లు, బాతులను చంపేయాలని జార్ఖండ్‌ ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని బకారో జిల్లాలో ప్రభుత్వం నిర్వహించే ఓ ఫౌల్ట్రీ ఫామ్‌ లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో రక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం వ్యాధి ప్రభావిత ప్రాంతంలోని 4000 కోళ్లు, బాతులను చంపే ప్రక్రియ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.   హెచ్‌5ఎన్‌1, ఏవియన్‌ ఇన్‌ ఫ్లూయెంజా వైరస్‌ రకాలను ప్రొటీన్లు అధికంగా ఉండే 'కడక్‌ నాథ్‌' కొళ్లలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో లోహాంచల్‌లోని కోళ్ల ఫారమ్‌ లో 800 కోళ్లు చనిపోగా, మరో 103 కోళ్లను అధికారులు చంపేశారు.

వ్యాధి ప్రభావిత ప్రాంతం నుండి ఒక కిలోమీటర్‌ పరిధిలోని ''కోళ్లు మరియు బాతులు సహా మొత్తం 3,856 పక్షులను చంపే ప్రక్రియ అధికారులు ప్రారంభించారు. ఆదివారం కూడా కోళ్లను చంపనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2న పొలంలో పక్షులు చనిపోవడంతో నమూనాలను భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌కు పరీక్షల నిమిత్తం పంపగా ఫ్లూ నిర్ధారణ అయింది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే పొలానికి 1 కి.మీ పరిధిలోని ప్రాంతాలను ప్రభావిత జోన్‌గా ప్రకటించగా, 10 కి.మీ పరిధిలోని ప్రాంతాలను నిఘా జోన్‌గా ప్రకటించింది. జిల్లాలో కోళ్లు, బాతుల విక్రయాలపై నిషేధం విధించింది.

బర్డ్‌ఫ్లూ వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తమైందని హెల్త్‌ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో నిఘా పర్యవేక్షణకు, పెద్ద కోళ్ల ఫారాల వద్ద నమూనాలను సేకరించేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రభావిత ప్రాంతంలోని ప్రజల నమూనాలను కూడా సేకరిస్తున్నారు. ఎవరిలోనైనా బర్డ్‌ ఫ్లూ లక్షణాలు గుర్తిస్తే.. వెంటనే ఆస్పత్రి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆస్పత్రిలో బర్డ్‌ ఫ్లూ కోసం ప్రత్యేకవార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.