Oct 02,2020 07:39

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఏ స్థాయిలో, ఎంత అమానుషంగా ఉంటుందో చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌ లోని హథ్రాస్‌ ఘటనే తాజా నిదర్శనం. అత్యాచారం చేసి, నాలుక తెగకోసి అగ్రవర్ణ అహంకారం వికటాట్టహాసం చేస్తే రోజుల తరబడి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా, గౌరవనీయమైన పద్ధతిలో అంత్యక్రియలకూ అవకాశం ఇవ్వని అధికారం మనుధర్మమే ఇరుసుగా రాజ్యం సాగిన రోజులను గుర్తుకు తెచ్చింది. హింసోన్మాదానికి దిగిన వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు పోలీసులు కావచ్చు, మరొకరు కావచ్చు. ఆ స్థాయిలో మద్దతు ఇచ్చారంటే అక్కడ భారత రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతోందా అన్న అనుమానం వస్తే తప్పేంటి? ఆ బీభత్సం సృష్టించిన దిగ్భ్రాంతి నుండి జాతి కోలుకోకముందే ఆ రాష్ట్రంలో ఆ తరహా సంఘటనలు ఈ నాలుగైదు రోజుల్లోనే మరో రెండు జరిగాయంటూ వార్తలు రావడం ఎంత ఘోరం! ఆ నాలుగైదు రోజుల్లోనే దేశం దళితులపై దేశం మొత్తం మీద జరిగిన దాడులను, అత్యాచారాలను లెక్క తీస్తే ఎన్నని లెక్క తేలేవో? గత ఏడాది రాజస్థాన్‌లో 554 మంది, ఉత్తరప్రదేశ్‌లో 537 మంది దళిత మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే అత్యాచారాలకు, దాడులకు గురవుతున్న వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతుండటం! నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్సు బ్యూరో ప్రకటించిన వివరాల ప్రకారం 2016 నాటికి అంతకు ముందు దశాబ్ద కాలంతో పోలిస్తే ఎనిమిది రెట్లు (746 శాతం) దళితులు, గిరిజనుల పైన దాడులు పెరిగాయి. ఆ తరువాత వరుసగా మూడు సంవత్సరాల్లోనూ ఈ తరహా నేరాలు పెరగడంతో పాటు, వాటి తీవ్రత కూడా పెరిగింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉండటం సిగ్గుచేటు.
నూతన సరళీకరణ ఆర్థిక విధానాలతో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందంటూ పాలక వర్గాలు ఒకవైపు ఊదరగొడుతుంటే మరోవైపు ఈ బీభత్స రసాలు, పిశాచగణాల విద్వేషకాండలు ఆవిష్కరిస్తున్న సత్యం ఏమిటి? ఘనమైనదంటూ గతాన్ని గురించి మురిసిపోయే పాలకులు వర్తమానంలో దుర్భలులను వేధించుకు తింటూంటే దన్ను ఇస్తున్నది ఎందుకుని? నిజానికి పాలకవర్గాలు గొప్పగా చెప్పే ఆర్థిక సంస్కరణలు బలహీనులను మరింత శక్తిహీనులుగా మార్చాయి. శతాబ్దాల అణచివేత పర్యవసానంగా అణగారి సమాజపు అట్టడుగు పొరల్లోకి నెట్టబడిన దళితులు నిజమైన సమానత్వ స్థాయిని పొందాలంటే, మార్పుకు ప్రభుత్వమే చోదకశక్తిగా ఉండాలి. కాని, నయా ఉదారవాదం ప్రభుత్వ జోక్యాన్ని అమితంగా కట్టడి చేసింది. కార్పొరేట్లకే పెద్దపీట వేసింది. లాభమే పరమార్ధమైన తరువాత సామాజిక న్యాయానికి తావెక్కడీ ప్రభుత్వమే పూనుకున్నా సాధించని సామాజిక న్యాయాన్ని కార్పొరేట్లు తెచ్చిపెడతాయా? దున్నేవాడికే భూమంటూ ఒకప్పుడు ఉధృతంగా సాగిన పోరాటాల ఫలితంగా అంతో ఇంతో నేలను దక్కించుకున్న నిరుపేదల నుండి గుంజుకునే విధానాలను ప్రభుత్వాలు ఇప్పుడు అమలు చేస్తున్నాయి. ఫలితంగా భూమిని కోల్పోయి రోడ్డున పడుతున్న వారిలో దళితులే ఎక్కువ! రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మనువాద సంస్కృతినే అమలు చేయడానికి సిద్ధపడన మోడీ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల పైన చర్చ జరగాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల ప్రకటనలు ప్రభుత్వ దృష్టి ఏ దిశగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి.
అటు నయా ఉదారవాద విధానాలను, ఇటు మనువాదాన్ని ఎదిరించి ఓడించకుండా ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించడం సాధ్యం కాదు, సరికదా కనీసపు రక్షణ కూడా దళితులకు గ్యారంటీ ఉండదు. ఈ దిశలో జరిగే కార్యాచరణే చిరకాలం జరిగిన మోసాల నుండి, బలవంతుల దౌర్జన్యాల నుండి, కార్పొరేట్ల కుట్రల నుండి దళితులతో పాటు, నిర్భాగ్యులందరికి విముక్తి మార్గాన్ని చూపుతుంది.