
- కనుమరుగవుతున్న పరిశోధనాత్మక జర్నలిజం : ఎంహెచ్ స్మారకోపన్యాసంలో రిటైర్డు సుప్రీం జడ్జి జస్టిస్ గోపాల గౌడ
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా నాడు ఏర్పచుకున్న లక్ష్యాలు చేరుకోవడంలో ఇంకా సుదూరంగానే ఉన్నామని రిటైర్డు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గోపాల గౌడ్ అన్నారు. ఇప్పటికీ రాజ్యాంగం ముందు అనేక సవాళ్లు ఉన్నాయని తెలిపారు. మోటూరు హనుమంతరావు లాంటి నాయకులు నేటి తరానికే కాకుండా తనలాంటి వారికి కూడా మార్గదర్శకులని కొనియాడారు. ఆయన మార్గదర్శకంలోనే ఎస్‌ఎఫ్‌ఐ వ్యవస్థాపకుల్లో తాము ఒకరిగా ఉన్నామని చెప్పారు. మోటూరు హనుమంతరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జానకిరామయ్య కళ్యాణమండపంలో మంగళవారం జరిగింది. 'రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్లు-మీడియా పాత్ర' అనే అంశంపై ప్రజాశక్తి ఎడిటర్ తులసీదాస్ అధ్యక్షతన జరిగిన సభలో గోపాల గౌడ్ ప్రసంగించారు. జనాభాలో సగభాగమున్న స్త్రీలకు ఇప్పటికీ సమానత్వం సాధించలేకపోయామని చెప్పారు. చట్టసభల్లో ఇప్పటికీ 25 శాతం సీట్లు ఇవ్వలేకపోతున్నామన్నారు. ఇందులో న్యాయవ్యవస్థ మినహాయింపు కాదని చెప్పారు. సామాజిక, ఆర్థిక సమానత్వమూ ఇంకా అందలేదని విచారం వ్యక్తం చేశారు. పోర్తు ఎస్టేట్‌గా చెప్పుకునే మీడియాలోనూ పరిశోధనాత్మకత చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దఎత్తున కార్పొరేట్ ప్రకటనలపై ఆధారపడిన మీడియా అందుకు అనుగుణంగానే వార్తలిస్తోందే తప్ప ప్రజా సమస్యలపై పరిశోధనాత్మకత కథనాలిచ్చే పరిస్థితి లేదని చెప్పారు. దేశంలో 2014 నుంచి 2020 మధ్య మీడియాకు వచ్చిన ప్రకటనల విలువ రూ.6,500 కోట్లు అని గుర్తు చేశారు. ఇంత పెద్దఎత్తున ప్రకటనలు పొందుతున్న మీడియా... వ్యతిరేక కథనాలివ్వ గలదా అని ప్రశ్నించారు. అయితే స్వతంత్ర జర్నలిస్టులు కొందరు అక్కడక్కడా ప్రజా సమస్యలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అటువంటి జర్నలిస్టులపైనా దాడులు తప్పడం లేదని చెప్పారు. మరోవైపు దేశంలో మత విద్వేషాలు పెరుగుతున్నా యన్నారు. మెజార్టీ, మైనార్టీ అన్న మిగతా 2లో తేడా ఏదీ రాజ్యాంగ పరిధిలో లేదని చెప్పారు. అయితే ఆ పేరుతో ఇప్పుడు దేశంలో రాజకీయం నడుస్తోందన్నారు. ఇటువంటి రాజకీయాలకు స్వస్థి పలికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి అవసరముందని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలికితీయడంలో జర్నలిస్టుల కృషి ఎంతగానో ఉందని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారని గుర్తు చేశారు. అటువంటి జర్నలిస్టులకు ఇటువంటి ప్రోత్సహకాలు అందించే కార్యక్రమాన్ని ప్రజాశక్తి నిర్వహించడం అభినందనీయమన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి తరం యువత సమాజం గురించి ఆలోచించడం మానేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్ష భావజాలమున్న యువత నేడు ఎంతో అవసరమన్నారు. నిష్పపక్షపాతంగా ప్రజాసమస్యలను మీడియా వెలికితీయాలని కోరారు. మోటూరు హనుమంతరావు అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్ తెలకపల్లి రవి మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను వెలికితీసే జర్నలిస్టులకు ప్రోత్సహం అందించే ఉద్దేశంతోనే మోటూరు హనుమంతరావు అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిఏటా ప్రజాశక్తి నిర్వహిస్తుందని తెలిపారు.
అవార్డులు ప్రదానం
మోటూరు హనుమంతరావు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం పుట్టపర్తిలో మంగళవారం ఉదయం జరిగింది. మోటూరు హనుమంతరావు అవార్డును నవభూమి బ్యూరో తుమ్మలపల్లి ప్రసాద్‌కు అందజేశారు. జ్ఞాపికతోపాటు శాలువకప్పి సత్కరించారు. ప్రజాశక్తి దినపత్రికలో పనిచేసే విలేకరులకు ఇచ్చే అంతర్గత అవార్డుల ప్రదానోత్సవంలో స్టేట్ బ్యూరోకు పవన్‌కుమార్, స్టాపర్‌లో శ్రీనివాసాచారి, మండల విలేకరులలో హిందూపురం విలేకరి షబ్బీర్, ప్రకాశం జిల్లా సింగరాయకొండ విలేకరి రవికుమార్‌కు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి చీఫ్ జనరల్ మేనేజరు అచ్యుతరావు, అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్ తెలకపల్లి రవి, అవార్డుల కమిటీసభ్యులు ప్రొఫెసర్ అనిత, ప్రజాశక్తి మేనేజరు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.