బ్రిటిష్ ప్రభుత్వం కూడా చేయలేని ఘనకార్యాన్ని నేడు మోడీ ప్రభుత్వం చేసింది. బ్రిటిష్ ఇండియాలో కార్మికులు సాధించుకున్న సంఘాలు పెట్టుకునే హక్కును కూడా నేడు కాలరాసింది. కార్మిక చట్టాల సంస్కరణల పేరుతో కార్మికులకు వర్తించే 44 కార్మిక చట్టాలను మార్చివేసి, వాటి స్థానంలో డొల్లగా ఉండే నాలుగు లేబర్ కోడ్ లను తీసుకు వచ్చింది. పారిశ్రామికాభివృద్ధి క్రమంలో కార్మిక చట్టాలు, సంక్షేమ చర్యలు ఒక అంతర్భాగంగా ఏర్పడ్డాయి. ఏ ఆధునిక సమాజంలోనైనా ఎవరికైనా ఖచ్చితంగా ఉండవలసినది సంఘం పెట్టుకునే హక్కు. దీనికి అనుగుణంగానే 1926లో మన దేశంలో ట్రేడ్ యూనియన్ చట్టాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఈ హక్కును కూడా కబళించడానికి మోడీ ప్రభుత్వం సాహసించడం పచ్చి కార్మిక వ్యతిరేక చర్య తప్ప మరొకటి కాదు.
వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే కార్మిక చట్టాలలో సవరణలకు బలమైన పునాది పడింది. అయితే, కార్మికుల తీవ్ర ప్రతిఘటన వల్ల, బిజెపికి పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ లేక పోవడం వల్ల వారనుకున్నది అప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉండడం, రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇవ్వడంతో కార్మికచట్టాల సవరణ సాధ్యమైంది. మోడీ ప్రభుత్వం ఈ చట్టాల సవరణలకు ముందు కార్మిక సంఘాలను సంప్రదిం చాలనే కనీస సాంప్రదాయానికి కూడా తిలోదకాలిచ్చింది.
మన దేశంలో ఏ చట్టాలూ లేని కాలంలో కూడా, తీవ్ర దోపిడి నుండి తమను తాము రక్షించుకోవడానికై కార్మికులు సంఘటితం అవుతూనే ఉన్నారు. అలా పుట్టినవే సంఘాలు. ఈ సంఘాల ద్వారానే కార్మికులకు మెరుగైన వేతనాలు, సదుపాయాలు, భద్రత వంటివి సాధ్యమయ్యాయి. తాజా లేబర్ కోడ్ లలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ చట్టాన్ని, పారిశ్రామిక వివాదాల చట్టాన్ని, పారిశ్రామిక స్టాండింగ్ ఆర్డర్ల చట్టాన్ని తిరగ రాసి పారిశ్రామిక సంబంధాల కోడ్ ను తయారు చేసింది. ఈ కోడ్ బ్రిటిష్ కాలంలో కూడా లేని యూనియన్ల రిజిస్ట్రేషన్ ను సైతం రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కల్పించింది. దీని ద్వారా కార్మికులకు వున్న డిమాండ్లను, సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లేకుండా చేసింది. కార్మికులు ప్రపంచ వ్యాపితంగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి నిస్సిగ్గుగా స్వస్తి చెప్పి 12 గంటల పనిని చట్టబద్దం చేసింది. యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కులను తీసి వేస్తూ, కనీస వేతనాలను కుదిస్తూ, వాటి సవరణలకు ఆస్కారం లేకుండా చేస్తూ, అన్నింటికీ మించి ఉద్యోగ భద్రతే లేకుండా చేసే 'హైర్ అండ్ ఫైర్' విధానానికి చట్టబద్ధత కల్పించడం వంటి అనేక క్రూరమైన సవరణలకు మోడీ ప్రభుత్వం పూనుకుంది. ఒక పక్క వున్న హక్కులను కాలరాచేలా చట్టాలను సవరించి, మరో పక్క చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు బనాయించవచ్చని పేర్కొంది. యూనియన్లు, సమ్మె హక్కులు లేకపోతే కార్మికుల అసంతృప్తిని తెలియచేసే సాధనమే లేకుండా పోతుంది. అప్పుడు పారిశ్రామిక వివాదాలు ఏర్పడితే పరిష్కరించే యంత్రాంగమే లేని దుర్భర పరిస్థితులలో కార్మికులు తెలిపే నిరసన చర్యలు ప్రభుత్వం దృష్టిలో అసాంఘికమైనవే అవుతాయి. అప్పుడు వీరిని సంఘ వ్యతిరేకులని, అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేసి జైల్లో కుక్కితే దేశం ఎటు పోతుంది? ఈ చర్యలకు బాధ్యులు ఎవరు? నేరానికి పాల్పడిన వారా, లేక నేరానికి పురికొల్పిన వారా? తామే గొప్ప ప్రజాస్వామ్య వాదులమని డబ్బాలు కొట్టుకునే వీరు, కనీస ప్రజాస్వామ్య హక్కులను కూడా కాలరాయడం ద్వారా దేశాన్ని ఎటు తీసుకు వెళుతున్నారు? వీరు జపించే పురాతన సమాజం వైపా? తిరిగి బానిసత్వం వైపా?
నిస్సిగ్గుగా పెట్టుబడిదారుల సేవలో మునిగి తేలుతూ, కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను నిలువరించడం ఎలా అన్నదే నేడు కార్మికుల ముందున్న సవాలు. అన్ని మార్గాలను అన్వేషించడం తప్ప మరో దారి లేదు. క్రూరమైన ప్రభుత్వం, భరోసా కల్పించలేని న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు...న్యాయం జరిగే అన్ని మార్గాలు మూసుకు పోయినప్పుడు...ఇక కార్మికుల ముందున్నది ఒకటే మార్గం. అదే పోరాట మార్గం. ఈ మార్గం భారత దేశ కార్మిక వర్గానికి కొత్తేమీ కాదు. బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు పొందుతున్న హక్కులన్నీ పొరాడి సాధించుకున్నవే. నిర్బంధాలను, అణచివేతలను, ఉద్యోగాల నుండి తీసివేతలను ఎదుర్కొని సాధించుకున్నవే. కుట్ర కేసులు, జైళ్ళ నిర్బంధం, దేశద్రోహ నేరాల బనాయింపు వంటివన్నింటిని ఎదుర్కొని నిలబడడమేకాక, ముందుకు పురోగమించిన వీరోచిత చరిత్ర కలిగిన కార్మికవర్గం...నేడు మోడీ ప్రభుత్వ చర్యలకు లొంగిపోతుందనుకోవడం అవివేకమే. అణచివేశామనుకోవడం అహంకారమే. పెట్టుబడిదారుల కొమ్ము కాసే ప్రభుత్వాల భరతం పట్టిన కార్మిక వర్గానికి నేడు మోడీని ఎదుర్కోవడం కూడా సాధ్యమే. సంస్కరణల యుగంలో గత మూడు దశాబ్దాలుగా అనేక పోరాటాల ద్వారా కార్మికులపై జరుగుతున్న దాడులను ఎదుర్కొంటూ, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకుంటూ నిర్మించుకున్న విశాల కార్మిక ఐక్యతే నేడు వారికి రక్ష. ఈ ఐక్యత ప్రతిబింబించేలా నవంబరు 26 దేశ వ్యాపిత సమ్మె ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేయాలి.
- ఎ. అజ శర్మ (సిఐటియు రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు)










