Jul 14,2023 12:27

కర్నూల్‌ స్పోర్ట్స్‌ : కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ కోడ్‌ నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని, తమకు ఇష్టం వచ్చినట్టు ఎదుటివారిపై మాట్లాడడం సరైనది కాదు అని.. జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి జి.శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం జి.శ్రీనివాసులు మాట్లాడుతూ ... కేంద్ర ప్రభుత్వం 2011లో స్పోర్ట్స్‌ కోడ్‌ను వాటిలో ఉన్న నియమ నిబంధనలను నియమిస్తూ క్రీడా సంఘాలు స్పోర్ట్స్‌ కోడ్‌ ప్రకారం నడుచుకోవాలని తెలియజేయడమైనదని అన్నారు. అయితే ఎపి రాష్ట్రం 2014లో విభజన జరిగిందని కాబట్టి రాష్ట్ర క్రీడా పాలక సంస్థ తెలియజేసిన రోజు నుండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్స్‌ కోడ్‌ వర్తిస్తుందని అన్నారు. ఇందులో ప్రధానంగా అధ్యక్షుడు 12 సంవత్సరాలపాటు కార్యదర్శిగా, 8 సంవత్సరాలపాటు ట్రెజరర్‌గా కొనసాగవచ్చునని చెప్పారు. అయితే ఈ మూడు ప్రధాన పదవులలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఉండకూడదు అని తెలిపారు. అలా ఉండాలని అనుకున్నవారు ఆయా శాఖల అధికారులతో తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అనే పత్రాన్ని తీసుకొని సంబంధిత పదవిలో కొనసాగవచ్చునని వివరించారు. ఈ మూడు పదవులలో కొనసాగినవారు తిరిగి మరో పదవిలో కొనసాగడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఇక జిల్లా సంఘాల విషయానికొస్తే ఈ ప్రధాన మూడు పదవులలో కొన్ని ఏళ్ల పాటు నుంచి కొనసాగుతున్నవారికి ఇతర క్రీడా సంఘాలు కోర్టు ద్వారా నోటీసులు పంపించేందుకు వారికి ఎలాంటి హక్కులు ఉండబోవని చెప్పారు. స్పోర్ట్స్‌ కోడ్‌ పరిజ్ఞానం లేనివారు ఏదో రకంగా ఆ జిల్లా సంఘాలను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో నోటీసులని మరొకటని బెదిరించడం జరుగుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నవారి రక్త సంబంధీకులు కానీ, వారి భార్య కానీ, భర్త గాని, కుటుంబ సభ్యులు ఎవరు కూడా పదవుల్లో కొనసాగడానికి వీల్లేదని తెలిపారు. అధ్యక్షుడు అయితే 12 సంవత్సరాలు, కార్యదర్శి, కోశాధికారి అయితే ఎనిమిది సంవత్సరాల పాటు ఉండవచ్చునన్నారు. మళ్లీ పోటీ చేయాలనుకుంటే నాలుగు సంవత్సరాలపాటు ఎలాంటి క్రీడా సంఘం లో ఉండకూడదని నిబంధన స్పష్టంగా ఉందని చెప్పారు. ఈ జిల్లా సంఘాలపై రాష్ట్ర సంఘాలకు మాత్రమే అజమాయిషి ఉంటుంది అని, వారు ఎన్ని సంవత్సరాలపాటు కొనసాగాలి.. కాలం గడిచిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరుపుకోవాలి.. అలాంటి విషయాలను ఆయా రాష్ట్ర సంఘాలు ప్రతినిధులు తెలియజేయడం జరుగుతుందన్నారు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర క్రీడా పాలక సంస్థ అధికారులు ఎలాంటి జోక్యం చేసుకునేందుకు వీలుండదు అని స్పష్టం చేశారు. వారు అడిగిన సమయంలో జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ట్రెజరర్‌ సంబంధించినటువంటి వివరాలను రాష్ట్ర క్రీడా పాలక అధికారులకు రాకపూర్వకంగా తెలియజేస్తామన్నారు. పై విషయాలలో ఇతర క్రీడా సంఘాలకు ఎలాంటి అధికారం ఉండబోదన్నారు. ఈ విషయాన్ని గమనించి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ కోడ్‌ నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరారు. అంతేగాని తమకు ఇష్టం వచ్చినట్టు ఎదుటి వారిపై మాట్లాడడం సరైనది కాదు అని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లా క్రీడా సంఘాలలో ఉన్న అపోహలను తొలగించేందుకు వివరాలు తెలియజేశామన్నారు.