నీ పొలంలో
నువ్వే కూలీ
ఏది పండించాలో
కార్పొరేట్లు చెపుతారు
రాజ్యం చోద్యం చూస్తుంది...
ఒకేసారి రైతు నెత్తిన
మూడు పిడుగులు
నిద్రాహారాలు మాని
నిరసన బాట పట్టాడు.
పొలం ఇల్లు వదిలి
నలభై రోజులు దాటింది
కురిసే మంచులో
కొరికే చలిలో ఢిల్లీలో
చావు చట్టాల రద్దు కోసం
విక్రమార్కుడవుతున్నాడు.
మూడు చట్టాలను
ముద్దుల్లో ముంచి
పొగడ్తల్లో తేలుస్తున్న
రాజ్యం మాత్రం
తను పట్టిన కుందేలుకు
మూడే కాళ్ళు అంటోంది
తను చూడలేని
ఆ నాలుగో కాలుగా
రైతు వేదన మిగులుతోంది
రాజ్యమా
కార్పొరేట్ కళ్ళద్దాలు తీసి
రైతు కళ్ళలోకి సూటిగా చూడు
నిజం బోధపడతోంది
రైతు ఆక్రందన
ప్రజాఉద్యమం కాకముందే
మేలుకో
రైతును బతికించు
దేశాన్ని రక్షించు
పట్టుదలకు పోతే
కాలం చూస్తూ ఊరుకోదు.
* కళ్ళేపల్లి తిరుమలరావు, సెల్: 91770 74280