Feb 01,2021 15:24

న్యూఢిల్లీ : జనాభా లెక్కలు కూడా కాగిత రహితంగా పూర్తిగా డిజిటల్‌ విధానంలో సేకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. చరిత్రలోనే మొదటిసారిగా కాగిత రహితంగా జనగణన జరగనుందని మంత్రి తెలిపారు. మొదటిసారిగా బడ్జెట్ ను కాగిత రహితంగా  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా  డిజిటల్‌ విధానంలో పెన్ను, పేపర్‌ లేకుండా జనగణన చేపట్టడంతో ప్రభుత్వ కార్యకలాపాలను పూర్తిగా డిజిటలైజేషన్‌ చేసేందుకు దోహదపడుతుందని బడ్జెట్‌ ప్రసంగంలో సీతారామన్‌ వివరించారు. 2021లో నిర్వహించే జనాభా లెక్కలను పూర్తిగా డిజిటల్‌ విధానంలో నమోదు చేయనున్నట్లు 2019లోనే కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.  ఇందుకోసం రూ.12 వేల కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు. అలాగే మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని గతంలో ఆయన వివరించారు. అయితే దానికి సంబంధించిన విధివిధానాలను మాత్రం ప్రకటించలేదు.