Oct 15,2023 07:06
  • మన జీవన గమనంలో అత్యంత కీలకమైంది ప్రతి క్షణం, నిముషం, ఎలా ఉపయోగించుకోవాలి? ఏ నిముషం ఏమి చేయాలనేది? పరిణామక్రమంలో అత్యంత కీలకమైంది. జీవి పుట్టుక నుండి ప్రస్తుత ప్రాణం లేని యంత్రాలు పనిచేస్తున్న ఈ క్షణం వరకూ లెక్కలు, అంచనాలే ఆధారం. వాటికి మూలమైంది గణాంకం (స్టాటిస్టిక్స్‌) ఇది లేకుండా ఏదీ జరగదు. దేనికైనా లెక్క ఉండాలి.. అది సరిగ్గా.. సహేతుంగా ఉండాలి. కాకి లెక్కలు.. దొంగ లెక్కలు.. వేసే రోజుల్లో ఉన్నాం. ఈ నెల 20వ తేదీ 'ప్రపంచ గణాంకాల దినోత్సవం' సందర్భంగా వీటి ఉపయోగాలు, ప్రాధాన్యతల గురించి తెలిపే ప్రత్యేక కథనం..

మానవాభివృద్ధి సూచీగానీ, యంత్ర తయారీగానీ, అంతదాకా ఎందుకు ఇటీవల చేపట్టిన చంద్రయాన్‌, ఆదిత్య శాటిలైట్లు కూడా గణాంకాల మీదే అధారపడి పనిచేస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సైన్స్‌కు మూలమూ గణాంకమే. అవేకాదు. ఆర్థికమూ, జనాభా లెక్కలు, గ్రహాల క్షక్ష్యల పరిశీలన, ప్రభుత్వాలను మార్చే ఎన్నికలు, ఆర్థికవ్యవస్థలో కీలకమైన బడ్జెట్లు, ద్రవ్యోల్బణం, రూపాయి మారకం. వ్యవస్థలో పాతుకుపోయిన కులాలు, మతాల వారీ ప్రజల వివరాలూ ప్రతిదీ గణాంకం మీదే అధారపడి ఉంటుంది. ప్రపంచాల మధ్య యుద్ధాలు కూడా ఈ గణాంకం (ఆర్థిక పరమైన) మీదే అధారపడి జరుగుతున్నాయి. ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా డేటానే ఆధారం. అంటే మానవ జీవితంలో స్టాటిస్టిక్స్‌ లేకుండా ఏమీ జరగదు.. మనుగడలో అభివృద్ధీ ఉండదు. డేటా సేకరణ, విశ్లేషణ శతాబ్దాల క్రితమే మొదలైంది. అయినప్పటికీ ఇటీవలి కాలంలో వినూత్న ఆలోచనలు, పరిష్కార విధానాలు ముందుకు రావడంతో గణాంక (డేటా) విలువ, ప్రభావం అనూహ్యంగా పెరిగింది.
ఇలా ఏర్పడింది..
శతాబ్దాల క్రితమే గణాంక అంశాలు ప్రపంచానికి తెలిసినా మన దేశంలో 1893లో కోల్‌కతాలో జన్మించిన మహలనోబిస్‌ ఆ రంగంపై ఉన్న ఆసక్తితో అనేక పరిశోధనలు చేసి ప్రపంచస్థాయికి ఎదిగారు. అనేక రంగాల్లో ఇప్పటికీ ఆయన సూచించిన అంశాలనే పరిగణనలోకి తీసుకుని, పరిశోధనలు చేస్తున్నారు. మనం ఎలా అభివృద్ధి చెందాలి? కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? ఎంచుకున్న వృత్తిలో ఎలా పనిచేయాలనేది కూడా డేటా అధారంగానే సాగుతోంది. తొలుత ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన 2010 అక్టోబర్‌ 20వ తేదీన 'అధికారిక గణాంకాల విజయాలు' అనే పేరుతో గణాంక దినోత్సవాన్ని నిర్వహించారు. 2015లో 'బెటర్‌ డేటా, బెటర్‌ లైఫ్‌' అనే పేరుతో రెండో గణాంక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి గణాంక దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమతి 2015, జూన్‌ 3వ తేదీన నిర్ణయించింది. ఈ ఏడాది 'మేము విశ్వసించగల డేటాతో ప్రపంచాన్ని కలుపుతాం' అనే నినాదాన్ని తీసుకుంది. బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ అత్యంత వేగవంతమైన వృద్ధిని కలిగి ఉన్న రంగాల్లో స్టాటిస్టిక్స్‌ ఒకటని 2018లోనే అంచనా వేసింది. ఈ రంగంలో 7.4 శాతం ఉద్యోగాలు పెరుగుతాయని పేర్కొంది. గణాంకాల మీద అవగాహన ఉంటే ఎక్కడో ఒకచోట ఉపాధి దొరుకుతుందనీ పేర్కొంది.

cencus-story-in-india-sneha-story-population
  • స్టాటిస్టిక్స్‌ ఇలా..

ఇటాలియన్‌ పదం స్టాటిస్టా నుండి స్టాటిస్టిక్స్‌ అనే పదం మొదలైంది. 1749లో గాట్‌ఫ్రైడ్‌ అచెన్‌వాల్‌ అనే వ్యక్తి దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. తొలుత ఇది జనాభా లెక్కల కోసమే వినియోగించారు. రాజకీయ అంకగణితంగా పరిగణనలో ఉన్నప్పటికీ 1791లో సర్‌ జాన్‌ సింక్లెయిర్‌ దీన్ని ఇంగ్లీషులోకి మార్చి, వాడుకలోకి తెచ్చారు. స్కాట్లాండు దేశానికి సంబంధించిన వివరాలతో తొలి లెక్కలను స్టాటిస్టిక్స్‌ పద్ధతిలో ప్రచురించారు. 18వ శతాబ్దంలో యూరోపియన్‌ దేశాల్లో అక్కడ పారిశ్రామిక అవసరాల కోసం రూపొందించడంలో కీలకంగా ఉన్న గణాంక పద్ధతి నేడు ప్రపంచ గమనానికే కీలకంగా మారింది. తొలుత ఆయా ప్రాంతాల్లో ఉంటే జనాభా లెక్కల కోసం వినియోగించారు. అయితే రానురాను అన్ని రకాల సమాచారాన్ని సేకరించడంలో గణాంకపద్ధతి కీలకపాత్ర పోషిస్తోంది. ఒక సమాచారాన్ని సేకరించడం, దాన్ని విశ్లేషించడంతోనే వ్యవస్థలను నడపగలుతున్నారు. డేటా ప్రాసెసింగ్‌ అవసరాలు కంప్యూటర్‌ ప్రాధాన్యతను ప్రపంచానికి తెలిపాయి. రెండు శతాబ్దాల్లో జనాభా లెక్కలు, ఆర్థిక కేటాయింపులు, వ్యవహారాలతో చివరకు సైనిక రంగంలో వాడే ప్రతి పనిలోనూ డేటా కీలకంగా మారింది.

  • కంప్యూటర్లు వచ్చాక..

19వ శతాబ్దం వచ్చేనాటికి డేటా సేకరణ, దాని విశ్లేషణ, సారాంశం యొక్క అవసరం విస్తృతమైంది. కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చిన తరువాత డేటా విశ్లేషణ తేలికైంది. దీంతో పాటు వాటిని ఎలా వినియోగించుకోవాలో విశ్లేషించే వ్యవస్థ కూడా మెరుగైంది. ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ మిలియన్ల కొద్దీ ఫైళ్లను పరిశీలన చేస్తున్నారంటే దానివెనుక డేటానే కీలకం. ఈ డేటాలో అనేక రకాల అంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

cencus-story-in-india-sneha-story-population
  • ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సైతం..

భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించగల ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కూడా డేటా అధారంగానే పనిచేస్తోంది. ఇది బిగ్‌ డేటాపై అధారపడి ఉంది. దీనికోసం సైంటిస్టులు, మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్లు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు డిమాండు పెరిగింది. మన నిత్యజీవితంలో కీలకమైన డేటా అనలిస్ట్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, ఫైనాన్షియల్‌ రిస్క్‌ అనలిస్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అనలిస్ట్‌, ఆర్థిక సలహాదారు వంటి రంగాల్లోనూ డేటానే కీలకమైంది.

cencus-story-in-india-sneha-story-population
  • ఎన్నికల్లోనూ..

జీవితంలో ఎదురుపడే ప్రతి అంశంలోనూ పత్రికలు, వివరణలు, క్రీడలు, స్టాక్‌మార్కెట్లు, ధరలు ఇవన్నీ స్టాటిస్టిక్స్‌ కిందకే వస్తాయి. చిన్న ఎన్నికల నుండి రాష్ట్రపతి ఎన్నికల వరకూ లెక్కలే ఆధారం. వాతావరణాన్ని కూడా ఇదే పద్ధతిలో అంచనా వేస్తారు. ఎన్నికల్లో ఏయే వర్గాలకు ఏ పనులు చేస్తే.. ఎన్ని ఓట్లు వస్తాయనే అంశానికి కూడా లెక్కలు వేయాల్సిందే. ప్రతి విషయాన్ని సేకరించడం, విశ్లేషించడం, వివరించడం వీటి ద్వారా అధ్యయనం చేయడమే గణాంకం యొక్క ముఖ్యోద్దేశం. విద్యా, వైజ్ఞానిక, శాస్త్రీయ రంగాల్లో ఒక కొత్త ప్రశ్న వచ్చిందంటే.. దాని వెనుక గణాంకం ఉంటుంది. అదే కొత్త పరిశోధనలు, శాస్త్రీయ పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిల్లో అనేక రకాల అంశాలు, పద్ధతులూ ఉంటాయి. ఒకటి మనకు తెలియని అంశాన్ని ఎలా తెలుసుకోవాలో అంచనా వేయడం. రెండోది తెలిసిన అంశమైనా అదేమిటో మనకు అర్థంకాకపోతే ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడం. దీనికి కూడా గణాంక విశ్లేషణే కీలకం అవుతుంది. ప్రతి అంశాన్నీ లెక్కగట్టడం ద్వారానే పురోగతి, భవిష్యత్‌లో ఏమి చేయాలన్న ఆలోచన ముందుకు వస్తాయి.

 

  • వాతావరణంలోనూ..

ఒక నదికి వరద వచ్చిందంటే ఎంత వర్షం పడింది. పడిననీరు ఎంత పరిమాణంలో తయారవుతుంది. ఎంత వేగంగా ప్రయాణించి ఏ రోజుకు ఎక్కడకు చేరుతుంది అనే అంశాలన్నీ వందేళ్ల నుండి లెక్కగట్టడం ద్వారానే ప్రవాహంలో రాబోయే ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడం.. దానికోసం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉంచడం సాధ్యం. ఇవన్నీ కూడా ఒక లెక్క ప్రకారం జరగాల్సిందే. వీటన్నింటినీ వేర్వేరు పద్ధతుల్లో గణాంకాల ద్వారానే అంచనావేసి, సమాజ పరిణామంగానీ అభివృద్ధిగానీ ముందుకు తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. విద్య, వైద్యం, ఆధునిక పరిశోధనలు ఇలాంటి అన్ని అంశాలనూ పరిశోధించాలన్నా గణాంకాలు కావాల్సిందే.

  • అనేక పద్ధతులు.. పరిశీలనలు..

డేటాను సేకరించడానికి, ప్రదర్శించడానికి ఒకే పద్ధతి ఏమీ ఉండదు. ఒక వస్తువు, మానవ సమూహం ఏదైనా సరే దాని పరిమాణం ఎంత, విలువ ఎంత అనేది డేటా ఆధారంగానే లెక్కగట్టాలి. దేశంలో ఏ వయస్సువారు ఎంతమంది ఉన్నారు. వారికి అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి దొరుకుతుందా.. నివాస ప్రాంతాలు ఉన్నాయా.. అనే అంశాలు తెలియాలన్నా లెక్కలే ముఖ్యం. ప్రతి అధ్యయనం నుండి డేటాను సేకరించడానికి అనేక పద్ధతులను నిపుణులు ఉపయోగిస్తున్నారు. వాటిల్లో గ్రాఫ్‌లు, పట్టికలు వంటివి కీలకంగా ఉన్నాయి. వీటిని హెల్త్‌కేర్‌, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఇంజనీరింగ్‌, బిజినెస్‌ వంటి అన్ని రంగాలనూ వినియోగిస్తారు. రోజువారీ జీవనంలో గణాంకాలను అన్వయించడం ద్వారానే పురోగతి సాధ్యం. ప్రస్తుతం మనం కొనుగోలు చేసే అనేక ఉత్పత్తులు, ప్రదర్శనలు, నిత్యం ఉపయోగించే వస్తువులు, వాటిని రోజురోజుకూ అధునాతంగా మెరుగుపరచడం వంటివన్నీ.. నేడు టెక్‌ కంపెనీలు చేస్తున్నాయంటే వాటి వెనుక డేటానే కీలకం. జనాభా లెక్కల నుండి బడ్జెట్లో నిధుల కేటాయింపు.. ఏ రంగానికి ఎంత, జిల్లాకు ఎంత ఇవ్వాలనే అంశాలను ప్రస్తుత పాలకులు లెక్కలు గడుతున్నారంటే దానికీ గణాంకాలే ఆధారం. ప్రతి అంశంలోనూ గణాంకాలను వర్తింపజేయడం ద్వారానే ఆయా దేశాల్లో ప్రభుత్వాలు పాలన చేయగలుగుతున్నాయి. రాష్ట్రాలు, దేశాల లెక్కలే కాదు ఐక్యరాజ్యసమితి కూడా గణాంకాల ఆధారంగానే అంచనాలు వేసేది. వీటి ద్వారానే వ్యవస్థకు సలహాలు, సూచనలు ఐరాస ఇవ్వగలుగుతోంది.

  • ప్రస్తుత ప్రభుత్వ విధానాలు

ప్రస్తుతం ప్రభుత్వాలు డేటాను వాడుకోవడంతోపాటు వాటిని దుర్వినియోగం చేయడంలో కీలకంగా మారాయి. ఒక ప్రాంతం అభివృద్ది చెందాలంటే అక్కడ ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, కులం, మతం అనేవి లెక్కించడమే కాదు.. ఇంతకుముందే చెప్పినట్లు వాటికి అవసరమైన నిధులు కేటాయింపూ ప్రధానమే. వ్యాపారవేత్తలు ఇవే గణాంకాలతో అభివృద్ధి చెందుతుంటే, పాలకులేమో దేశాన్ని వెనక్కు నెడుతున్నారు. ఉదాహరణకు కులాల వారీగా ప్రజలను లెక్కించడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి అవసరమైన నిధులను వృత్తుల ఆధారంగానో, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగానో కేటాయించి ముందుకు తీసుకెళ్లాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దీన్ని తొక్కిపెడుతోంది. మరీ ముఖ్యంగా వికలాంగుల అంశంపై ఉదారంగా వ్యవహరించాల్సిన ఈ ప్రభుత్వాలు వారి సంఖ్యను తగ్గించి చూపిస్తున్నాయి. అంటే ఏ పనీచేసుకోలేక ఇబ్బందులు పడే వికలాంగులను ప్రత్యేక కేటగిరీగా చూసి, వారికి అదనంగా నిధులు కేటాయించాల్సి ఉంది. ఆ బాధ్యత నుండి తప్పుకోవడం కోసం వారి సంఖ్యనే తగ్గించి చూపించడం దారుణం. ఇది ఒక్క కేంద్రమే కాదు దాదాపు సంస్కరణల బాటలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. సంక్షేమానికి నిధుల కేటాయింపును తగ్గించడం, వ్యాపారాభివృద్ధికి అవసరమైన అంశాలకు నిధులు పెంచడం అనే అంశాలనే ప్రధానంగా తీసుకున్నాయి. దీనికోసం తప్పుడు గణాంకాలను ప్రపంచానికి చూపిస్తున్నాయి. మనం చూసే జిడిపి, జిఎస్‌డిపి, ఆర్థిక సూచీలు, ఇవన్నీ తిండి లేని ప్రజలను ఏమార్చేందుకు తయారుచేస్తున్న గణాంకాలే. అందుకే ప్రతిఒక్కరూ గణాంకాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి. వాటి ఆధారంగా అంచనా వేయడంలో అవగాహన పెంచుకోవాలి.

  • మనిషి పుట్టుకే ఒక లెక్క

జీవ పరిణామ క్రమంలో గర్భంలో పిండం తయారీ కూడా ఒక లెక్క మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మనిషి పుట్టడానికి అవసరమైన కణాల విశ్లేషణకూ గణాంకాలే ఆధారం. జీవం ఎప్పుడు తయారైంది? దీనిలో సరీసృపాలు, ఉభయచరాలు ఎన్నేళ్లకు తయారయ్యాయి? భూమి ఎప్పుడు పుట్టింది? సముద్రాలు ఎంతకాలం నాడు ఏర్పాటయ్యాయి? వీటన్నింటినీ లెక్కలు వేయడం ద్వారానే భవిష్యత్‌ జీవనం ఎంతకాలం ఉంటుందనేది అంచనాకు వస్తున్నారు. ఇదే ఇప్పుడు సైన్స్‌లో కీలకమైంది. ముందే చెప్పినట్లు ఒక గ్రహం నుండి మరో గ్రహం మీదకు మనిషి వెళుతున్నాడంటే.. దానివెనుకా డేటా సైన్స్‌, జియోలాజికల్‌ సైన్స్‌, జియోఫిజికల్‌ రీసెర్చ్‌ డేటా ప్రధానం.

cencus-story-in-india-sneha-story-population
  • జన గణనం.. ప్రధానం..

ప్రస్తుతం దేశం అభివృద్ధి చెందాలన్నా, బడ్జెట్‌ కేటాయింపులు చేయాలన్నా జనాభా లెక్కలు కీలకం. మొట్టమొదటిగా గణాంకశాస్త్రం జనాభా లెక్కల కోసమే ప్రారంభించారు. ఒక ప్రాంతంలోగానీ, దేశంలోగానీ జనాభా ఎంతమంది? అందులో పిల్లలు, మహిళలు, పురుషులు, మధ్యవయస్కులు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు ఎందరు? ఆ విభిన్న ప్రతిభావంతుల్లో వేర్వేరు కారణాలతో వైకల్యం వచ్చినవారు.. ఇలా అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరిస్తారు. అప్పట్లో పాలనలో కీలకమైన ఎన్నికల కోసం దీన్ని వినియోగించేవారు. అంటే మొత్తం జనాభా ఎంతమంది? వారిలో ఓటు వేయగలిగిన వారు ఎందరు అనేది కూడా అంచనా వేయడం ఎన్నికల్లో ప్రధానం. డేటా సైన్స్‌ పెరిగిన తరువాత విశ్లేషణలు మారిపోవడంతో పాటు చివరకు ఓట్ల కొనుగోలుకూ రాజకీయవేత్తలు ఈ డేటా మీదే ఆధారపడి కార్యకలాపాలు నడుపుతున్నారు. ఇటీవల బీహార్‌లో బిసి జనగణన జరిగింది. మరో రాష్ట్రం కూడా సమాయత్తమవుతుందని ప్రకటించింది.

  • డేటాతోనే డిక్టేట్‌ చేసేస్తున్నారు..

సరళీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక, డేటా విశ్లేషణ యొక్క ప్రాధాన్యతలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ప్రభుత్వాల నిర్వహణ కోసం లెక్కలను వినియోగించుకుంటే.. ఇప్పుడు దోచుకోవడం కోసమే డేటాను వాడుతున్నారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా లెక్కలతో పాటు అక్కడుండే వనరులనూ గణాంకాల ఆధారంగా విశ్లేషిస్తాయి. నిరంతరం డేటాపై అధారపడి విశ్లేషణలు చేసే వ్యాపారవేత్తలు వెంటనే ఆ ప్రాంతంలోనో, రాష్ట్రంలోనో వాలిపోయి వాటిని దోచుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు. అంటే అక్కడ భూమి, అడవులు, జనాభా, కులం, పంటలు పండే స్థితి, వాతావరణం, జనాభా రేషియో, వైద్య ఆరోగ్యసేవలు ఇలాంటి అంశాలన్నీ లెక్కగడుతున్నారు. వాటి ఆధారంగా అక్కడ ఏ వ్యాపారం చేయాలి? దానికోసం ఆ ప్రాంతంలో ఎలా అడుగుపెట్టాలి? సేవా కార్యక్రమం, కాలుష్యం, ప్రచారం తదితర పేర్లతో ముందుకు వెళుతున్నారు. గత 40 ఏళ్లలో వచ్చిన మార్పుల ఆధారంగా వచ్చే 20-30 ఏళ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎంత ఆదాయం వస్తుంది? ఇవన్నీ వ్యాపారవేత్తలు లెక్కలు వేయడం ద్వారానే.. ప్రభుత్వాలను ఆశ్రయించి, వాటి మద్దతుతో దోపిడీకి తెరలేపుతున్నారు. వ్యాపారి 20 ఏళ్ల అనంతరం పరిస్థితిని ఆలోచించి లెక్కలుగడతాడు.. అది ఎలా అంటే.. డేటాసైన్స్‌ను అమలు చేయడమే. విశ్లేషించిన డేటాను అత్యంత జాగ్రత్తగా వాడుకోవడమూ వ్యాపార నియమాల్లో అత్యంత ప్రధానం. ఇది బయటపడిందంటే మరొకరు అక్కడ వాలిపోతారు. డేటా ఎంత పెరిగిందో దాన్ని తస్కరించడమూ అంతే పెరిగింది. డేటాను కాపాడుకోవడం ఇప్పుడున్న సమాజంలో అత్యంత కీలకం. దీనికోసమే వ్యాపారవేత్తలు ముందుగా సైబర్‌ నిపుణులను ఎంగేజ్‌ చేసుకుంటున్నారు. సైబర్‌ టెక్నాలజీ తొలి ఉద్దేశమూ అదే. వారి డేటా బయటకుపోకుండా, ఎవరూ తస్కరించకుండా కాపాడుకోవడమే. ఈ గణాంకాల విశ్లేషణ ద్వారానే అదానీ, అంబానీల్లాంటి వ్యాపారవేత్తలు అపర కుబేరులుగా ఎదుగుతున్నారు. ఈ డేటాకు సాంకేతిక కాలంలో పెట్టిన కొత్తపేరే 'కర్మ'. వ్యాపారవేత్తలు చెప్పే కర్మ సిద్ధాంతం వెనుక అసలు నిజం డేటానే. దీన్ని వ్యాపారి దోచుకోవడానికి, మతోన్మాది ప్రజలను చీల్చడానికి, ఉగ్రవాది సమాజాన్ని నాశనం చేయడానికి వాడుతున్నారు. అందుకే డేటాకు అంత ప్రాధాన్యత ఏర్పడింది.

cencus-story-in-india-sneha-story-population
  • బడ్జెట్‌ కేటాయింపులు

ప్రస్తుత ప్రభుత్వాలు నడవాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా బడ్జెట్‌ కేటాయింపులు కీలకం. ఈ కేటాయింపులను గత ఇరవై ఏళ్ల క్రితం వరకూ అప్పటి వాస్తవిక అంచనాలకు అనుగుణంగా చేసేవారు. రాజకీయవేత్తలు, నిపుణులు అందరూ చర్చించి.. కొంత నిధిని కేటాయించడం ద్వారా ఆ ప్రాంతం లేదా ప్రజల అభివృద్ధికి నిధులు ఉపయోగించేవారు. ప్రస్తుతం లెక్కల్లో కులాలు, మతాలను విడగొడుతున్నారు. ఏ కులం వారికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఏ మతం వారికి ఆ ప్రాంతంలో ప్రాబల్యం ఉందని విశ్లేషణలు జరపడం ద్వారా నిధుల కేటాయింపు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అనేక రాష్ట్రాలు బడ్జెట్‌ కేటాయింపులు అనేవి ఓటు బ్యాంకు రాజకీయాల ఆధారంగా నడుస్తున్నాయి. అంటే అక్కడ కూడా గణాంకమే కీలకమైంది. ఈ కేటాయింపుల ప్రతిఫలాలు ఏమిటనే అంశాన్ని లెక్కగట్టి, వారి ఎన్నికల ప్రచారాలను నిర్వహించుకుంటున్నారు. 2005, 2006లో అయితే అప్పటి ప్రభుత్వం మండలాలు, గ్రామాల వారీగా కులాలు, మతాలు, భూములు, నైసర్గిక పరిస్థితుల మీదా నివేదికలు తయారుచేశాయి. వాటిని ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషించుకుంటూ ముందుకెళుతున్నారు.

cencus-story-in-india-sneha-story-population
  • పట్టణ ప్రాంతాల ప్లానింగ్‌..!

పట్టణ ప్రణాళిక కూడా 30 ఏళ్ల తరువాత ఎంతమంది జనాభా ఉంటారు. వారి అవసరాలు ఎలా ఉంటాయనే విషయం అధారంగానే లెక్కగట్టి రోడ్ల వెడల్పు ఎంతుండాలో నిర్ణయిస్తారు. అంటే అంతకుముందు 100 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం నగరం జనాభా ఎంత ? అప్పటి అవసరాలు ఎంత ? అనే అంశాలన్నిటినీ అంచనా వేసుకుంటూ రావడం ద్వారానే భవిష్యత్‌కు రూపకల్పన చేస్తారు. దీన్నే మాస్టర్‌ ప్లాను అంటారు. ఇందులో గణాంకాలే కీలకపాత్ర పోషిస్తాయి. ఇంజనీర్లు వీటిని విశ్లేషించడం ద్వారా ఆయా నగరాలు ఎంత విస్తరిస్తాయి. ఎంత పెంచాలి అనేది లెక్కగడతారు. ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలో ఇంజనీర్లు వేసిన అంచనాలు ఒక్కటీ తప్పుకాలేదని ఒక సర్వేలో తేలింది. ఇటీవల కన్సల్టెంట్లు ముందుకొచ్చి (ఇంతకుముందు వ్యాపారుల విశ్లేషణలో డేటా కీలకం అని చెప్పిన విషయం గుర్తుపెట్టుకోవాలి) వారి వద్ద ఉన్న అంశాల ఆధారంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం స్వీయ లబ్దికోసమో, వ్యాపార లబ్దికోసమో ఉంటున్నాయి. పూర్తిగా కాకపోయినా ప్రైవేటు కన్సల్టెంట్లు రూపొందించే డేటా విశ్లేషణల వల్ల సమాజానికి పెద్దగా ఉపయోగం లేకపోగా, ప్రజలకూ అన్ని రూపాల్లో నష్టం వాటిల్లుతోందనేది వాస్తవం.

- వల్లభనేని సురేష్‌
9490099208