- పాలనా సరిహద్దులు మూసివేత గడుపు 2024 జనవరి1వరకు పొడిగింపు
- బడ్జెట్ కేటాయింపుల కుదింపు
న్యూఢిల్లీ : ఎప్పుడో పూర్తి కావాల్సిన జాతీయ జనాభా లెక్కల సేకరణ-2021ను మోడీ ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసింది. జనాభా వివరాలు సేకరించేటప్పుడు పాలనా పరమైన సరిహద్దుల మూసివేత గడువును వచ్చే ఏడాది జనవరి 1 వరకు పొడిగించింది. 2021 జనాభా లెక్కల సేకరణ కార్యక్రమానికి గత బడ్జెట్‌లో రూ. 3,675 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 2023-24 బడ్జెట్‌లో రూ.1564 కోట్లకు కుదించేేసింది. చావు కబురు చల్లగా చెప్పినట్టు జనాభా లెక్కల నమోదు వచ్చే ఏడాది చేపట్టవచ్చని చెప్పింది ఈ విషయంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు జనగణనను చేపట్టవద్దని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జిఐ) ద్వారా లేఖలు పంపింది. జనగణన కోసం తాలుకాలు, జిల్లాల పరిపాలన సరిహద్దులను స్థంభింపజేయడా నికి గడువును జనవరి 1, 2024 వరకూ ఆర్‌జిఐ పొడిగించింది. సాధారణంగా ఈ సరిహద్దులను స్థంభింపచేసిన తరువాత కొన్ని నెలలు తరువాత జనగణన ప్రారంభమవుతుంది. జనగణనలో పాల్గొనే ఎమ్యూనేటర్ల శిక్షణకే కనీసం మూడు నెలలు కేటాయిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రకారం చూస్తే పరిపాలన సరిహద్దులు నిర్ణయించిన తరువాత ఈ ఎన్నికల నిర్వహణకే సిబ్బందిని కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తరువాతే జనగణన 2021 ప్రారంభమవుతుంది. మనదేశంలో ప్రతీ పదేళ్లకొకసారి జనగణనను నిర్వహిస్తుంటారు. 2021లో జరగాల్సిన జనగణనను కరోనా వైరస్ విజృంభణను చూపుతూ మోడీ ప్రభుత్వం వాయిదా వేసింది. తాజా వాయిదాకు ఎలాంటి కారణాన్ని మోడీ ప్రభుత్వం వెల్లడించలేదు.










