Oct 05,2023 08:21
  • న్యూస్‌క్లిక్‌పై దాడులకు నిరసనగా పలుచోట్ల ఆందోళనలు

ప్రజాశక్తి- యంత్రాంగం : స్వతంత్ర మీడియా సంస్థ న్యూస్‌క్లిక్‌ కార్యాలయంపైన, సిబ్బంది ఇళ్లపైన కేంద్ర ప్రభుత్వ దాడిని నిరసిస్తూ విశాఖ, కర్నూలు, పశ్చిమగోదావరిలో నిరసన తెలిపారు. న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌, హెచ్‌ఆర్‌ విభాగం అధిపతిని అరెస్టు చేయడాన్ని పలువురు నేతలు ఖండించారు. 
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ.. స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే ఈ ఫాసిస్టు తరహా దాడిని ఇప్పటి వరకూ చూడలేదన్నారు. ఢిల్లీలో కొన్ని న్యూస్‌ ఛానల్స్‌, పత్రికా కార్యాలయాలపై సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు అత్యంత దుర్మార్గమన్నారు. కొంతమందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. మరికొంతమందిని కోర్టులో ప్రవేశపెట్టలేదని అన్నారు. ప్రతిపక్షాలపైన, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అభ్యుదయవాదులపైన అప్రజాస్వామికంగా మోడీ, అమిత్‌ షా దాడులు చేయడం దారుణమన్నారు.
కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట గాంధీ విగ్రహం సమీపంలో ప్రజాసంఘాలు, న్యాయవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ సంఘీభావం తెలిపింది. సిఐటియు నగర నాయకులు టి.రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐలు రాష్ట్ర నాయకులు కేంగార కుమార్‌, డి.వెంకటస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి. నారాయణ, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.ఆనంద్‌బాబు, ఆవాజ్‌ కమిటీ నాయకులు ఎస్‌ఎండి షరీఫ్‌, ఎపిడబ్ల్యుజెఎఫ్‌ నగర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర మాట్లాడారు. బిజెపి ప్రభుత్వ హయాంలో బిబిసి, న్యూస్‌ లాండ్రీ, దైనిక్‌భాస్కర్‌, భారత్‌ సమాచార్‌, ది కాశ్మీర్‌ వాలా , ది వైర్‌ వంటి మీడియా సంస్థలను అణచివేయడానికి, వేధించడానికి, భయపెట్టడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శించారు. ఉపా చట్టం కింద వివిధ సెక్షన్లతో దాడులు చేస్తోందన్నారు. విశాఖలోని కూర్మన్నపాలెం స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చి వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రజాశక్తి ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎపిడబ్లుజెఎఫ్‌ నాయకులు ఎన్‌. మధుసూదనరావు, జి.కాంతారావు, కె.అప్పలనాయుడు, ఎం. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
స్వేచ్ఛకు సంకెళ్లు సిగ్గు సిగ్గు, మీడియాపై దాడి హేయం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనకాపల్లి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ కూడలిలో సిఐటియు ఆధ్వర్యాన నిరసన తెలిపారు. బిజెపి హయాంలో మీడియాపై దాడులు పెరిగాయని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.