Oct 19,2023 09:58

తిరువనంతపురం : రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛా హక్కు అంతరించిపోతోందని పలువురు పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేశారు. 'భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ' అనే అంశంపై తిరువనంతపురంలో జరిగిన సెమినార్‌లో సీనియర్‌ పాత్రికేయులు ప్రసంగిస్తూ మీడియా గొంతు నొక్కేందుకు ఉపా చట్టాన్ని, వలసవాదుల కాలం నాటి రాజద్రోహ చట్టాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. మీడియాలో భయాన్ని, అభద్రతాభావాన్ని వ్యాప్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోని దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని వారు ఆరోపించారు.
'ది వైర్‌' వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్ధ వరదరాజన్‌ సెమినార్‌ను ప్రారంభిస్తూ న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌పై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ఖండించారు. అత్యవసర పరిస్థితి కాలంలో కంటే ఇప్పుడు పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని ఆయన విమర్శించారు. ఉపా కింద అరెస్టయిన విద్యార్థులు, పాత్రికేయులు బెయిల్‌ రాక సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రశ్నార్థకమైందని, పాత్రికేయులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సెమినార్‌లో సీనియర్‌ పాత్రికేయులు కేజే జాకబ్‌, జి.రాధాకృష్ణన్‌, రాష్ట్ర మాజీ మంత్రి థామస్‌ ఐజాక్‌ తదితరులు ప్రసంగించారు.