
న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్ కార్యాలయాలు, జర్నలిస్టులపై దాడి కేసులో అరెస్టు చేసిన ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిలపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని ముఖ్యాంశాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్‌పై భారత ప్రభుత్వ పోరాటానికి అపఖ్యాతి తెచ్చేలా వ్యవహరించారని, కాశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లు భారత్‌లో అంతర్భాగం కాదని నిరూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని, అలాగే రైతుల ఆందోళనకు నిధులు అందించారని, చైనా కంపెనీలైన షియోమీ, వివోలు అక్రమంగా పెద్ద మొత్తంలో భారత్‌లోకి నిధులు చొప్పించాయని, వాటి వెనుక విస్తృతమైన క్రిమినల్ కుట్ర దాగి వుందని ఎఫ్‌ఐఆర్ ఆరోపించింది. పైగా ఈ టెలికం కంపెనీలకు వ్యతిరేకంగా నమోదైన అక్రమ కేసులను గౌతమ్ భాటియా అనే వ్యక్తి వాదిస్తున్నాడని ఆ ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. భాటియాను కీలకమైన వ్యక్తిగా అది పేర్కొంది. రెండు చైనా టెలికం కంపెనీలు పిఎంఎల్‌ఎ, ఫెమా నిబంధనలను ఉల్లంఘించి వేలాది బూటకపు కంపెనీలను భారత్‌లోకి చొప్పించాయని, వాటి ద్వారా అక్రమంగా విదేశీ నిధులు వచ్చాయని ఎఫ్‌ఐఆర్ ఆరోపించింది. ఆ గౌతమ్ భాటియా ఎవరు అనేది చెప్పలేదు. అలాగే ఆ రెండు చైనా కంపెనీల తరపు న్యాయవాది గౌతమ్ భాటియా అని చూపించేలా కోర్టు రికార్డులు కూడా లేవు.
ఆ పేరుతో వున్న న్యాయవాది రాజ్యాంగంపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై అందరి ప్రశంసలు పొందిన రచయితగా వున్నారు. మానవ హక్కులకు సంబంధించిన కేసులపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెడతారు. ఆయనకు ఈ చైనా టెలికం కంపెనీలకు ఎలాంటి సంబంధాలు లేవు.
ప్రబీర్ ఫుర్కాయస్థ, నెవిల్లె రారు సింగమ్, గీతా హరిహరన్, గౌతమ్ భాటియా లు భారత్‌లో లీగల్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను సృష్టించేందుకు కుట్ర పన్నారని, చైనా టెలికం కంపెనీలు అందించే ప్రయోజనాలకు ప్రతిగా వాటిపై నమోదైన కేసులను వాదించేందుకు వీరు కృషి చేశారని ఎఫ్‌ఐఆర్ మరో అభాండాన్ని మోపింది.
మొబైల్ ఫోన్లు సరఫరాదారులుగా, పెట్టుబడిదారులుగా షియోమీ, వివోలకు భారత్‌లో విస్తృతమైన ఉనికి వుందని, షేర్‌చాట్, క్రెడిట్‌బీ, జెస్ట్‌మనీ వంటి భారతదేశంలోని అనేక స్టార్టప్‌ల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయని, మనీ లాండరింగ్ కార్యకలాపాలకు గానూ ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ఎదుర్కొంటున్నాయని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.
2020లో షియోమీ పిఎం కేర్స్ ఫండ్‌కు రూ.10కోట్లు విరాళంగా అందచేసిందని, ప్రస్తుతం భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పాదక యూనిట్లు పెట్టాలని యోచిస్తోందని అది ఆరోపించింది.
భారత ప్రభుత్వ విధానాలను విమర్శించేలా పెయిడ్ న్యూస్ ప్రచురించేందుకు చైనా నిధులను పెద్ద మొత్తంలో ఉపయోగిస్తూ, ఆ విధానాలను ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు.
భారత్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరిగేందుకు చైనా నుండి పెద్ద మొత్తంలో మభ్యపెట్టే రీతిలో నిధులు వస్తున్నాయని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. దేశీయ విధానాలను, భారత్ అభివృద్ధి ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా విమర్శించేలా పెయిడ్ న్యూస్ వున్నాయని పేర్కొంది. చైనా ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను సమర్ధిస్తూ వాటిని పెంపొందించేలా ప్రచారం జరుగుతోందని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.
2019 లోక్‌సభ ఎన్నికలను విధ్వంసం చేసేందుకు పుర్కాయస్థతో కలిసి కుట్రలో భాగంగా ఏన్నో ఏళ్ళ క్రితం ఏర్పడి, ఇప్పుడు పనిచేయని వాట్సాప్ గ్రూప్ గురించి పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల క్రమాన్ని ధ్వంసం చేసే లక్ష్యంతో పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం (పిఎడిఎస్)గా పిలిచే గ్రూపుతో కలిసి ప్రబీర్ పుర్కాయస్థ కుట్ర పన్నినట్లు తెలుస్తోందని పోలీసులు ఆరోపించారు. ఈ గ్రూపులో కీలకమైన వ్యక్తులు, ఈ కుట్రతో ప్రమేయం వున్నవారిలో బత్తిని రావు (పిఎడిఎస్ కన్వీనర్), దిలీప్ సైమన్, దీపక్ దౌలాకియా, హర్ష్ కపూర్, జమాల్ కిద్వారు, కిరణ్ షహీన్, సంజరు కుమార్, అసిత్ దాస్ ఉన్నారని ఆరోపించారు. వీరిలో సైమన్ ప్రముఖ చరిత్రకారుడు, కొన్నేళ్ళ క్రితమే ఢిల్లీ వర్శిటీ నుండి రిటైర్ అయ్యారు. దౌలాకియా ఒక సామాజిక కార్యకర్త, మేధావి. వీరిద్దరి నివాసాలపై ఈ నెల 3న దాడులు జరిగాయి, వారి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేయడం వెనుక గల సమాచారం లేదా వివరాలను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదు.
- దేశీయ ఔషధ పరిశ్రమపై తప్పుడు కథనాలంటూ మరో అభియోగం
కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషికి, ప్రయత్నాలకు అపఖ్యాతి తెచ్చేలా తప్పుడు కథనాలను ప్రచారం చేశారంటూ పుర్కాయస్థ, సింగమ్, రచయియత విజరు పరిషద్‌లపై మరో అభియోగం మోపింది. రిమాండ్ అభ్యర్ధనలో ఈ ఆరోపణను పోలీసులు పేర్కొన్నారు. పైగా వారు దేశీయ ఔషధ పరిశ్రమ గురించి తప్పుదారి పట్టించే కథనాలు ప్రచారం చేశారని తద్వారా జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించాలని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.
సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రు భావనను పెంపొందించేందుకు నెవిల్లె రారు సింగమ్‌తో కలిసి నిందితులు కుట్ర పన్నారంటూ తీవ్రమైన అభియోగాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు కానీ ఎఫ్‌ఐఆర్‌లో ఆ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగేలా నిషేధిత తీవ్రవాద సంస్థల పట్ల సానుభూతిగా వ్యవహరిస్తున్నారని పోలీసులు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
అయితే ఇప్పటివరకు ఏ నిషేధిత తీవ్రవాద సంస్థ గురించి వారు ప్రస్తావించారో పోలీసులు వివరించలేదు.
కాశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లు భారత్‌లో అంతర్భాగాలు కాదన్న తమ ఉద్దేశాలను పరస్పరం వెల్లడించుకునేలా పుర్కాయస్థ, సింగమ్‌లు ఇ మెయిల్స్ పంపుకున్నారని ఎఫ్‌ఐఆర్ ఆరోపించింది. సింగమ్, న్యూస్‌క్లిక్‌ల ప్రస్తావనతో ఆగస్టు 5న మీడియాలోని ఒక సెక్షన్‌లో కొన్ని ఇ మెయిల్స్ భాగాలు లీకయ్యాయని ప్రస్తావించింది. పుర్కాయస్థ, జాసన్ డి ఫెచర్‌లతో సహా తన సహచారులకు నెవిల్లె రారు పంపిన ఇ మెయిల్‌లో ఇటీవల చైనా తీసుకువచ్చిన హెచ్‌డి మ్యాప్ గురించిన ప్రస్తావన వుందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.