చండీఘర్ : పంజాబ్ ఆప్ మంత్రిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోమవారం అదుపులోకి తీసుకుంది. పంజాబ్ న్యాయశాఖ మంత్రి జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని ఓ బహిరంగ సభ నుండి జస్వంత్ సింగ్‌ను ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నారని, అయితే ఏ కేసుకు సంబంధించి అన్న వివరాలు తెలియాల్సి వుందని ఆ వర్గాలు తెలిపాయి. జస్వంత్ సింగ్ పంజాబ్‌లోని అమర్‌ఘర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
రూ. 41 కోట్ల బ్యాంక్ మోసం కేసులో గతేడాది సెప్టెంబర్‌లో ఆప్ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ నివాసంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన నివాసంతో పాటు మూడు ప్రాంతాల్లో సిబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ. 16.57 లక్షల నగదు సహా విదేశీ కరెన్సీ ( నిర్దేశించని మొత్తం), బ్యాంకు, ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకుంది.